చిరంజీవి (Chiranjeevi) కెరీర్‌లో బెస్ట్ సినిమాలు చాలానే వచ్చి ఉంటాయి. రికార్డులు బద్దలు కొట్టిన సినిమాలు కూడా వచ్చి ఉంటాయి. బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ఇండస్ట్రీ హిట్ అయిన సినిమాలూ ఉంటాయి. వాటన్నింటిలో ‘ఇంద్ర’ (Indra) సినిమా చాలా ప్రత్యేకం. అదేంటి.. ఆ బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఇదొకటి అని అంటారా? ఆ మాట నిజమే.. అయితే ‘ఇక చిరంజీవి వల్ల కాదు.. చిరంజీవి పని అయిపోయింది’ అనే విమర్శల నడుమ వచ్చి అదిరిపోయే విజయం అందుకుందీ చిత్రం.
చిరంజీవి అభిమానులకు ఈ విషయం గురించి ప్రత్యేకంగా గుర్తు చేయనక్కర్లేదు. ఈ సినిమాను చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల రీరిలీజ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ సినిమా రీరిలీజ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ లెక్కన ఆ సినిమా పునర్ విడుదల అది చిరంజీవి ఫ్యాన్స్‌కు పెద్ద కానుక అనే చెప్పాలి. మరి అంత కానుక ఇచ్చిన నిర్మాత అశ్వనీదత్‌కు (C. Aswani Dutt) చిరంజీవి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకుండా ఉంటారా? అందుకే తనదైన శైలిలో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు.
‘ఇంద్ర’ సినిమా రీ రిలీజ్‌ను పురస్కరించుకుని చిత్రబృందాన్ని శుక్రవారం చిరు కలిశారు. నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు బి.గోపాల్ (B. Gopal) , సంగీత దర్శకుడు మణిశర్మ (Mani Sharma) , రచయితలు పరుచూరి సోదరులు (పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) , పరుచూరి వెంకటేశ్వరరావు (Paruchuri Venkateswara Rao)), సినిమా కథా రచయిత చిన్నికృష్ణను (Chinni Krishna) ప్రత్యేకంగా తన ఇంటికి ఆహ్వానించి చిరంజీవి సత్కరించారు. ‘‘ఇంద్ర’ క్రియేట్ చేసిన సునామీ గుర్తుచేస్తూ.. 22 సంవత్సరాల తర్వాత మరోసారి థియేటర్లలో రిలీజైన సందర్భంగా ఇది నా చిరు సత్కారం. ఈ కలయిక సంద్భం సినిమా చిత్రీకరణ జరిగినప్పటి విశేషాలను మరోసారి గుర్తు చేసుకున్నాం’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
ఈ క్రమంలో అశ్వనీదత్‌కు ఒక శంఖాన్ని బహుమతిగా అందజేశారు. దీనికి సంబంధించి అశ్వనీదత్ ఎక్స్ (మాజీ ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘మీరు ఈ విజయశంఖాన్ని కానుకగా ఇచ్చారు. కానీ, ఇంద్రుడై, దేవేంద్రుడై దానిని పూరించింది మాత్రం ముమ్మాటికీ మీరే. ఈ కానుక అమూల్యం. ఈ జ్ఞాపకం అపురూపం. నా గుండెల్లో ఎప్పటికీ పదిలం’’ అని అశ్వనీదత్ ఆ పోస్టులో రాసుకొచ్చారు.