Nagarjuna: అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్!

  • August 24, 2024 / 05:05 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున  (Nagarjuna)  ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం అని ఆయన అన్నారు. మేము చట్టాన్ని ఉల్లంఘించలేదని చెప్పడం కోసమే ఈ ప్రకటన చేస్తున్నానని నాగార్జున పేర్కొన్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించిన భూమి పట్టా భూమి అని ఆ భవనం ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమని ఒక అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదని నాగ్ పేర్కొన్నారు.

Nagarjuna

కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీస్ పై కూడా కోర్టు స్టే విధించిందని ఆయన చెప్పుకొచ్చారు. స్పష్టంగా చెప్పాలంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత చట్ట విరుద్ధంగా జరిగిందని నాగార్జున కామెంట్లు చేశారు. ఈ రోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని కేసు కోర్టులో ఉన్న సమయంలో ఇలా చేయడం సరికాదని నాగ్ అన్నారు.

తాను చట్టాన్ని గౌరవించే పౌరుడినని కోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి ఉంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నేనే కూల్చేవాడినని ఆయన వెల్లడించారు. తాజా పరిణామాల వల్ల మేము తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ఆక్రమణలు చేశామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే ఛాన్స్ ఉందని నాగ్ తెలిపారు. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే నా ముఖ్య ఉద్దేశం అని నాగ్ వెల్లడించారు.

అధికారుల చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానానికి వెళ్తామని న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని నాగ్ వెల్లడించారు. నాగ్ ట్విట్టర్ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నాగార్జునకు తమ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా అధికారులు మాత్రం నాగార్జునకు నోటీసులు ఇచ్చామని చెబుతుండటం కొసమెరుపు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus