సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. నిన్నటి వరకు హైదరాబాద్ లోని బిజీ రోడ్లపై ఛేజింగ్ సీన్ షూటింగ్ పూర్తిచేసిన చిత్ర బృందం, నేడు ఐటీ హబ్ గచ్చిబౌలికి తరలింది. ఇక్కడ మహేష్ బాబు, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
వంద కోట్ల బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సూపర్ స్టార్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇందులో తమిళ దర్శకుడు, నటుడు ఎస్.జె.సూర్య విలన్ గా ప్రిన్స్ ని డీ కొట్టనున్నాడు. హైదరాబాద్ లో మూడో షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మురుగదాస్ బృందం గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ కి వెళ్తుంది.
అక్కడే దీపావళి వరకు విరామం లేకుండా షూటింగ్ చేయనుంది. పండుగ రోజు ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు ప్రయత్నిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ మూవీ వేసవిలో విడుదల కానుంది.