ఔట్ డోర్ లో సినిమా షూటింగ్ అంటే ప్రజలు గుమిగూడుతుంటారు. అదే స్టార్ హీరో మూవీ చిత్రీకరణ అయితే అభిమానులను కంట్రోల్ చేయడం పోలీసులకు చాలా కష్టం అవుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు సెట్స్ వేసుకొని, స్టూడియోలో షూటింగ్ చేస్తుంటారు. తమిళ స్టార్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న తాజా చిత్రంలో కథకి అవసరం అయినందున తప్పకుండా రోడ్లపైన షూటింగ్ చేయాల్సి వచ్చింది. అందుకు ఒప్పుకున్న ప్రిన్స్ రోడ్డు ఎక్కారు. పగలు అయితే ట్రాఫిక్ కి ఇబ్బంది కలుగుతుందని భావించిన చిత్ర బృందం రోడ్లపైన సన్నివేశాలను రాత్రి వేళలలో చిత్రీకరిస్తోంది. ఈనెల 9 నుంచి జరుగుతున్న ఈ షెడ్యూల్ 29 వరకు కొనసాగనుంది.
ఇక్కడ షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే చిత్ర బృందం బ్యాంకాక్ కి పయనం కానుంది. ఫిబ్రవరి నాటికి టాకీ పార్ట్ మొత్తం పూర్తి అవుతుందని, ఆ తర్వాత మిగిలిన రెండు పాటల కోసం విదేశాలకు వెళ్తామని నిర్మాత ఎన్వీ ప్రసాద్ చెప్పారు. వంద కోట్ల బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి “సంభవామి” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ జనవరి 26 న విడుదల చేయనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.