ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ ‘స్వాతిముత్యం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇందులో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయం కానున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాను ముందుగా జూలైలో రిలీజ్ చేయాలనుకున్నారు.
ఆ తరువాత ఆగస్టుకి వెళ్లింది. ఆగస్టు 13న రిలీజ్ అవుతుందని ప్రకటించారు కూడా. కానీ అదే సమయానికి పలు సినిమాలు రిలీజ్ అవ్వడంతో ‘స్వాతిముత్యం’ వెనక్కి తగ్గింది. అయితే ఇప్పుడు అక్టోబర్ 5న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అదే సమయానికి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ది ఘోస్ట్’ సినిమాలు రాబోతున్నాయి. ఆ రెండు సినిమాలతో పోటీగా ‘స్వాతిముత్యం’ రంగంలోకి దిగడం హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా అయితే ఇలాంటి సినిమాలను సేఫ్ జోన్ లో వదలాలని అనుకుంటున్నారు. కానీ నిర్మాత నాగవంశీ మాత్రం కంటెంట్ మీదున్న నమ్మకంతో అక్టోబర్ 5నే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే చిరు, నాగార్జునల మధ్య ఈ సినిమాకి ఎన్ని థియేటర్లు దొరుకుతాయనేది అసలు ప్రశ్న. ‘ది ఘోస్ట్’ సినిమాకి నైజాంలో ఎక్కువ థియేటర్లు పడతాయి.
ఎందుకంటే ఆ సినిమా నిర్మాత సునీల్ కి థియేటర్ల బిజినెస్ ఉంది. ‘గాడ్ ఫాదర్’ నిర్మాత ఎన్వీ ప్రసాద్ కి సీడెడ్ లో థియేటర్ల వ్యాపారం ఉంది. ఇలాంటి నేపథ్యంలో నిర్మాత నాగవంశీకి ఫైనాన్షియల్ గా రిస్క్ ఉండకపోవచ్చు కానీ తన సినిమాకి ఓపెనింగ్స్ తగ్గే ఛాన్స్ ఉంది. కానీ సినిమాకి టాక్ బాగుంటే ఆటోమేటిక్ గా జనాలు తమ సినిమాకి వస్తారనేది మేకర్స్ నమ్మకం. మరేం జరుగుతుందో చూడాలి!