‘మన శంకర్ వరప్రసాద్ గారు’.. సంక్రాంతికి వస్తున్నారు అంటూ సినిమా ప్రకటించినప్పుడే సినిమా జోనర్ ఏంటో చెప్పేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. వింటేజ్ చిరంజీవి మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని, ఆయన కామెడీ టైమింగ్, యాక్షన్ మోడ్‌ను పరిచయం ఇప్పటితరానికి పరిచయం చేస్తానని కూడా చెప్పారు. ఇప్పటివరకు ఆ సినిమా నుండి వచ్చిన ప్రచార చిత్రాల్లో ఆ ఛాయలు కనిపించాయి కూడా. ఇప్పుడు ట్రైలర్‌తో తన ప్లానింగ్ ఏంటో పూర్తిగా, క్లారిటీగా చెప్పేశారు.
సినిమా ట్రైలర్ గురించి చెప్పాలంటే.. చిరంజీవి చిలిపి చేష్టలు.. నయనతార రుసరుసలు.. అనిల్ రావిపూడి ఫ్యామిలీ పంచ్‌లతో కంప్లీట్ సంక్రాంతి ఫ్యామిలీ ప్యాకేజీగా కనిపిస్తోంది. దీనికి చిరంజీవి మార్క్ యాక్షన్ అంశాలు జోడించి ఆ లోటు కూడా లేకుండా చేశారు. కనుమ భోజనం పర్‌ఫెక్ట్‌గా ఉండటానికి అవసరమైన ఎక్స్‌ట్రా స్పెషల్ డిష్‌లా విక్టరీ వెంటకేశ్ ఎంట్రీని పెట్టారు. ట్రైలర్‌లో కనిపించింది ఆయన ఒక్క సీనే అయినా కంటికి ఇంపుగా ఉంది.
అందమైన నయనతారను మరింత అందంగా చూపించారు అనిల్ రావిపూడి. డైనమిక్ లేడీగా, చిరాకు శశిరేఖగా, శంకర్‌వరప్రసాద్ ప్రియురాలిగా ఆమె సూపర్ అని చెప్పొచ్చు. ఇక చుట్టూ ఉన్న పాత్రలు అన్నీ ప్రస్తుతానికి సపోర్టింగ్‌గా కనిపిస్తున్నాయంతే. ఎందుకంటే ట్రైలర్‌ను పూర్తిగా కవర్ చేసేసింది చిరంజీవి ఎక్స్‌ప్రెషన్స్, ఆయన తరహా గిమ్మిక్కులు, కామెడీ టైమింగ్‌తోనే. నాటి చిరంజీవి ఎలా భయపెడుతూ, మెలికలు తిరుగుతూ ప్రేక్షకుల్ని ఎంజాయ్ చేశారో.. ఇందులోనూ అంతే.
అనుకోని కారణాల వల్ల దూరమైన భార్యకు ఓ కష్టమొస్తే.. భద్రత కోసం వెళ్లిన చిరంజీవి ఏం చేశాడు? ఆమెకొచ్చిన ఆపద ఏంటి? అసలు శంకర్‌వరప్రసాద్ – శశిరేఖ ఎందుకు విడిపోయారు అనేది సినిమాలో కీలకమైన పాయింట్. డబ్బున్న అమ్మాయి, మధ్య తరగతి అబ్బాయి ప్రేమకథ ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్‌లో ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి శశిరేఖకు వెంకటేశ్ పాత్రకు సంబంధం ఏంటనేది సినిమా క్లైమాక్స్‌లో తెలిసే అవకాశం ఉంది. ఇవన్నీ తేలాలంటే ఈ నెల 12 రావాల్సిందే. ఆ రోజు ‘మన శంకర వరప్రసాద్ గారు’ వస్తున్నారు మరి.