ఎంత ప్రయత్నించినా సరైన సినిమా పడక నీరసంగా ఉన్నవాడికి.. ₹100 కోట్ల సినిమా పడితే ఎలా ఉంటుంది. ఈ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలియాలంటే శింబునే అడగాలి. ఎన్నో సినిమాలు చేసి హిట్ రాక ఒకవైపు, పర్సనల్ లైఫ్‌లో సమస్యలతో మరోవైపు శింబు సతమతం అవుతున్న వేళ ‘మానాడు’ అనే ఓ సినిమా చేశాడు. టైమ్ లూప్ అనే కాన్సెప్ట్‌లో నడిచే ఆ సినిమాకు తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇంకేముంది రూ. 100 కోట్ల వసూళ్లతో అదరగొట్టింది. ఇప్పుడు ఆ కిక్‌ను మరోసారి ఇవ్వడానికి శింబు అండ్ కో రెడీ అవుతున్నారు.
అవును, మీరు విన్నది కరెక్ట్. ‘మానాడు’ సినిమాకు సీక్వెల్‌కు ప్లాన్ రెడీ అయ్యింది. ‘మానాడు’ వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా చిత్రబృందం ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. అందులో ‘లూప్ కంటిన్యూస్ సూన్’ అని ఓ వాక్యం ఉంది. అది చూసి ‘మానాడు’ సీక్వెల్ త్వరలోనే మొదలవుతుంది అని అభిమానులు అంటున్నారు. టీమ్ వీడియోలో కూడా అదే విషయం అర్థమైంది అనుకోండి. అయితే అఫీషియల్‌గా త్వరలో ఈ సినిమా సీక్వెల్ గురించి ప్రకటిస్తారు.
ప్రస్తుతం శింబు ‘వెందు తనిందతు కాడు’ సీక్వెల్ పనుల్లో ఉన్నారు. మరోవైపు ‘మానాడు’ దర్శకుడు వెంకట్ ప్రభు నాగచైతన్య ‘కస్టడీ’ సినిమా పనుల్లో ఉన్నారు. ఈ రెండూ పూర్తయ్యాక ‘మానాడు’ సీక్వెల్ ఉండొచ్చు. ఈ సినిమాలోనూ ప్రతినాయకుడిగా ఎస్.జె.సూర్యనే నటిస్తారని సమాచారం. ఇక తొలి పార్టు విషయానికొస్తే టైమ్‌లూప్‌లో చిక్కుకున్న అబ్దుల్ ఖాలిక్, ధనుష్ కోడి ఏం చేశారు అనేదే కత. అన్నట్లు అభిమానుల కోసం నవంబర్ 27న ‘మానాడు’ ప్రత్యేక షో వేయనున్నారు.
ఇక తెలుగు విషయానికొస్తే ‘మానాడు’ రీమేక్ రైట్స్‌ను సురేశ్ ప్రొడక్షన్స్ ఇప్పటికే కైవసం చేసుకుంది. రానా హీరోగా ఈ సినిమాను రూపొందిస్తారట. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని సమాచారం. త్వరలోనే ప్రారంభిస్తారని తెలుస్తోంది. అయితే దర్శకుడి విషయంలోనే ఇంకా చర్చలు జరుగుతున్నాయట.