మంచు కుటుంబం.. ట్రోలింగ్స్.. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. ఆ కుటుంబం నుండి ఎవరు ఏం చేసినా.. ట్రోలర్స్ తమ టాలెంట్‌కి పని చెబుతారు. వాళ్లేం చేశారు, వీళ్లెందుకు ట్రోల్ చేశారు అనేది పట్టించుకోనవసరం లేదు. ఎందుకంటే మంచు ఫ్యామిలీ ఏం చేసినా.. ట్రోల్స్‌కి అనుకూలంగానే ఉంటాయి అంటుంటారు. అలా ట్రోలర్స్ ప్రతిసారి మంచు కుటుంబం చేసే పనిలో స్టఫ్ కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. ఏ చిన్న సందు దొరికినా.. దూరిపోతుంటారు.
అయితే ఈ ట్రోల్స్‌పై మంచు కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించడం గమనార్హం. ట్రోలింగ్స్ విషయంలో మొన్నీమధ్యే మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గురించి, తన కుటుంబం గురించి వదిలే ప్రసక్తే లేదని, వారందరి సంగతి తేలుస్తాను అంటూ ఘాటుగా స్పందించాడు. ‘జిన్నా’ సినిమా ప్రచారం సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు తరచుగా చేశారు విష్ణు. ప్రస్తుతం ఆ పనిలోనే ఆయన ఉన్నారు అని చెబుతున్నారు. అయితే ఇలాంటి ట్రోల్స్ విషయంలో తాను బాగా ఎంజాయ్ చేస్తాను అని చెబుతోంది మంచు లక్ష్మి.
తనపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ని, మీమ్స్‌ని బాగా ఆస్వాదిస్తుంటానని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. తనపై, తన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వచ్చే వీడియోలు, మీమ్స్, ట్రోల్స్‌ను చూస్తుంటానని, వాటిలో కొన్ని భలే సరదాగా ఉంటాయని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. ఆమె మలయాళంలో నటించిన ‘మాన్స్టర్’ సినిమా ప్రచారంలో భాగంగా మీడియా ముందుకు వచ్చి పై విధంగా మాట్లాడారు. దీంతో ఆమె అభిమానులు మంచు లక్ష్మి స్పోర్టివ్‌నెస్ అదీ అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ట్రోలర్స్ అయితే థ్యాంక్యూ అంటున్నారు.
ఆ మధ్య వరుసగా సినిమాల్లో నటించిన మంచు లక్ష్మి ఇప్పుడు ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ‘గాంబ్లర్’, ‘లేచింది మహిళాలోకం’, ‘అగ్నినక్షత్రం’ తదితక సినిమాల్లో నటిస్తున్నారు. మరోవైపు టీవీ షోలు, ఓటీటీ షోలు కూడా చేస్తున్నారు. అలా ఎప్పుడూ అభిమానుల మధ్యలోనే ఉంటున్నారు. అది తనకు చాలా కిక్ ఇచ్చే విషయం అని కూడా చెప్పారు మంచు లక్ష్మి.