“అతనికేమైనా పిచ్చా.. కాదు ఆడాళ్ళంటే కచ్చి” అనే డైలాగ్ తో మొదలయ్యే “మన్మధుడు” సినిమా ఇప్పటికీ ఆల్ టైమ్ ఫ్యావరెట్. నాగార్జున క్యారెక్టరైజేషన్, బ్రహ్మానందం & సునీల్ కామెడీ వీర లేవల్లో ఉంటాయి, అందుకే వందో సారి చూస్తున్నా కూడా మనస్ఫూర్తిగా నవ్వుకొంటాం. “మన్మధుడు” సినిమా రేంజ్ అది. ఇన్నాళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ గా “మన్మధుడు 2” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. “చిలసౌ”తో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రెండో చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుండగా కీర్తి సురేష్, సమంత ప్రత్యేక అతిధి పాత్రలు పోషించారు. ఆగస్ట్ 9, 2019న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం టీజర్ నేడు విడుదలైంది.
40 ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకోకుండా కుటుంబ సభ్యుల దృష్టిలో వర్జిన్ (?)గా మిగిలిపోయిన నవ మన్మధుడి పాత్రలో నాగార్జున ఈ “మన్మధుడు 2″లో కనిపిస్తున్నాడు మన కింగ్ నాగార్జున. ఫస్ట్ పార్ట్ లో అమ్మాయిలంటే అసహ్యించుకొనే వ్యక్తిగా కనిపించిన నాగార్జున ఈ సినిమాలో కాసనోవాగా కనిపిస్తున్నాడు. విజువల్స్ గట్రా రిచ్ గా ఉన్నాయి కానీ.. ఒరిజినల్ “మన్మధుడు”లో కనిపించిన స్వచ్చమైన కామెడీ మాత్రం కనిపించలేదు. ఈ మన్మధుడు ఫ్యామిలీస్ కంటే యూత్ ని ఎక్కువగా కాన్సన్ ట్రేట్ చేసినట్లున్నాడు. టీజర్ వరకూ పర్వాలేదనిపించుకొన్న “మన్మధుడు 2” సినిమాగా ఎలా ఉంటుందో చూడాలి. ఇకపోతే.. టీజర్ లో ఎక్కడా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కనిపించకపోవడం గమనార్హం. అన్నిటికంటే ముఖ్యంగా త్రివిక్రమ్ మాటలు, పంచ్ ల లోటు మాత్రం కాస్త గట్టిగానే కనిపిస్తోంది.