అనుపమ పరమేశ్వరన్, రెజీనా, విరాజ్ అశ్విన్ హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ మరీచిక. సతీష్ కాశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ, డైలాగ్స్‌ను లక్ష్మిభూపాల అందించారు. రాజీవ్ చిలక, మేఘా చిలక నిర్మించగా…. ఇళయరాజా మ్యూజిక్ అందించారు. శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది? అనుపమ పరమేశ్వరన్, రెజీనా తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించారా? లేదా? అంటే?
కథ: వెంకటలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్) గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ చదువుతుంటుంది. అదే కాలేజీలో సంజయ్ అలియాస్ సంజు (విరాజ్ అశ్విన్) క్యాంటిన్ నడుతుంటాడు. సంజును ప్రేమిస్తుంటుంది వెంకటలక్ష్మి. కానీ సంజు మాత్రం అమెరికా నుంచి వచ్చిన వెంకటలక్ష్మి స్నేహితురాలు మరీచికను (రెజీనా) ఇష్టపడతాడు. సంజు, మరీచిక పెళ్లి చేసుకుంటారు. పెళ్లైనా రెండో రోజే ఆస్తి కోసమే మరీచిక మోసం చేసి సంజును పెళ్లి చేసుకుందనే నిజం బయటపడుతుంది.
సంజుతో గొడవపడిన మరీచిక అతడిని చంపేస్తుంది. ఆ విషయాన్ని వెంకటలక్ష్మి పోలీసులకు చెబుతుంది. కానీ చనిపోయాడనుకున్న సంజు బతికే ఉంటాడు. అసలు మరీచిక అనే పేరుతో ఎవరూ లేరని పోలీసుల ఇన్వేస్టిగేషన్‌లో బయటపడుతుంది. కానీ మరీచిక మాత్రం సంజుతో పాటు వెంకటలక్ష్మిని కనిపిస్తూనే ఉంటుంది. అసలు మరీచిక ఎవరు? వెంకటలక్ష్మికి ఉన్న మానసిక సమస్య ఏమిటి? మరీచిక, వెంకటలక్ష్మిలలో సంజు ఎవరిని ఇష్టపడ్డాడు? మోసంతో తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకున్న వెంకటలక్ష్మికి చివరకు ఎలాంటి శిక్ష పడింది? అన్నదే మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: అనుపమ పరమేశ్వరన్, రెజీనా, విరాజ్ అశ్విన్ ఈ మూడు పాత్రల ప్రధానంగానే మరీచిక సాగుతుంది. పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌లో అనుపమ పరమేశ్వరన్ ఆకట్టుకుంది. డీ గ్లామర్ లుక్‌లో ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరు బాగుంది. పోలీస్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్‌లో తన యాక్టింగ్‌లో అనుపమ చక్కటి వేరియేషన్ చూపించింది. అమెరికా నుంచి వచ్చిన అమ్మాయిగా రెజీనా స్లాంగ్ డిఫరెంట్‌గా ఉంది. యాక్టింగ్‌లో మాత్రం ఆ వైవిధ్యత కనిపించలేదు. లవర్ బాయ్‌గా విరాజ్ అశ్విన్ ఓకే అనిపించాడు. కానీ కన్నింగ్‌నెస్ చూపించే సీన్స్‌లో తేలిపోయాడు. అజయ్ ఘోష్, వడ్లమాని శ్రీనివాస్ , తాగుబోతు రమేష్ తమ పరిధుల మేర మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు: మరీచికను థ్రిల్లర్ సినిమాకు తగ్గట్లుగా రేసీ స్క్రీన్‌ప్లే తో ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేసేలా నడిపించడంలో దర్శకుడు తబడిపోయాడు. ఈ సినిమాకు లక్ష్మీభూపాల అందించిన కథ బాగుంది. కానీ డైలాగ్స్‌లో మెరుపులు మిస్సయ్యాయి. ఇళయరాజా బీజీఎమ్ లవ్ సీన్స్‌లో ఆకట్టుకుంది. పాటలకు కథలో పెద్దగా స్కోప్ లేదు. రెండు మాంటేజ్ సాంగ్స్ ఉన్న అవి అంతగా ఎలివేట్ కాలేదు. నిర్మాణ విలువలతో పాటు అరవింద్ కన్నబిరన్ సినిమాటోగ్రఫీ ఓకే.
విశ్లేషణ: సినిమా చేయడం మాత్రమే కాదు… దానిని సరైన టైమ్‌లో రిలీజ్ చేయడం ముఖ్యమే. ఆలస్యమైతే ట్రెండ్, ఆడియెన్స్ టెస్ట్‌తో రిజల్ట్ కూడా మారిపోతుంటుంది. మరీచిక విషయంలో అదే జరిగింది. ఎప్పుడో 2022లో ఈ సినిమా పూర్తయ్యింది. అనివార్య కారణాల వల్ల నాలుగేళ్లు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. టైటిల్‌కు తగ్గట్లే సినిమాలో అడుగడుగునా పాత ఛాయలే కనిపిస్తాయి. అనుపమ, రెజీనా గెటప్, టేకింగ్ , మ్యూజిక్ …అన్ని ఔట్‌డేటెడ్ ఫీలింగ్‌ను కలిగిస్తాయి.
సైకలాజికల్ రివేంజ్ థ్రిల్లర్‌గా దర్శకుడు సతీష్ కాశెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు. తనకు జరిగిన అన్యాయంపై ఓ యువతి ఎలా రివేంజ్ తీర్చుకుంది అనే కాన్సెప్ట్‌ను లవ్‌స్టోరీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఉత్కంఠంగా చెప్పాలని అనుకున్నాడు. ఒకటి రెండు ట్విస్ట్‌లు మిగిలిన సినిమా మొత్తం సాగదీయడంతో బోరింగ్‌గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే లవ్‌స్టోరీ ఓపికకు పరీక్ష పెడుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా మొదలై థ్రిల్లర్ జానర్‌లోకి టర్న్ ఇచ్చి చివరకు హారర్ మూవీగా ఎండ్ ఎండ్ అవుతుంది. ఏ జానర్‌కు న్యాయం చేయలేకపోయాడు.
అనుపమ పరమేశ్వరన్, రెజీనా వంటి టాలెంటెడ్ యాక్టర్లు, ఇళయరాజా లాంటి దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా వారి టాలెంట్‌ను సరిగ్గా వాడుకోలేదు.
ఫోకస్ పాయింట్: మరీచిక టైటిల్‌లో ఉన్న క్రియేటివిటీ సినిమాలో లేదు. ఔట్‌డేటెడ్ థ్రిల్లర్ మూవీ.
రేటింగ్: 1.5/5