సంక్రాంతి, వేసవి, దసరా.. తెలుగు సినిమా వారికి ఇవి కీలకమైన సీజన్స్. ఈ కాలంలో సినిమాలు రిలీజ్ చేయడానికి స్టార్ హీరోలు ప్రయత్నిస్తుంటారు. ఈ ఏడాది వేసవి వార్ ముందుగానే మొదలయింది. మార్చి 30 నే రామ్ చరణ్ రంగస్థలంతో వచ్చి 200 కోట్లను కొల్లగొట్టారు. ఆ తర్వాత సినిమాలు నిరాశపరిచినప్పటికీ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను మూవీ 200 కోట్లకు దగ్గర్లో ఉంది. ఇంతటితో యుద్ధం ఆగిపోలేదు. మే 4 న అల్లు అర్జున్ సైనికుడిగా సినీ వార్ ని పెంచనున్నారు. అతను నటించిన నా పేరు సూర్య శుక్రవారం రిలీజ్ కాబోతోంది. దీని తర్వాత మహానటి సిద్ధంగా ఉంది.
అభినేత్రి సావిత్రి జీవితగాథతో తెరకెక్కిన ఈ సినిమా కోసం చిన్నాపెద్దా అందరూ ఎదురుచూస్తున్నారు. విజయ్ దేవరకొండ టాక్సీవాలాగా ఆకట్టుకోవడానికి వస్తున్నాడు. ప్రీ లుక్ తోనే అందరినీ ఆకర్షించిన నాగచైతన్య మూవీ సవ్యసాచిలో ప్రముఖ తమిళ నటుడు మాధవన్ నెగిటివ్ రోల్ చేయడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. నాగ్, వర్మల ఆఫీసర్, రజనీకాంత్ కాలా, మాస్ మహారాజా రవితేజ నేలటిక్కెట్, సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కలయికలో రూపుదిద్దుకున్న సమ్మోహనం.. నితిన్ శ్రీనివాస కళ్యాణం చిత్రాలు రేస్ లో ఉన్నాయి. దేనిని ప్రేక్షకులు ఆదరిస్తారో చూడాలి.