‘కింగ్’ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 3’ కు ఆదరణ రోజు రోజుకి పెరుగుతూవస్తోంది. ఇప్పటికే 9 వారాలు పూర్తిచేసుకుంది. ఈ మధ్య కాలంలో వీకెండ్ ఎపిసోడ్స్ కు కొత్త కొత్త గెస్ట్ లను పిలుస్తూ షో కు మరింత బూస్ట్ ఇస్తున్నాడు నాగ్. ఇప్పటికే రమ్యకృష్ణ 2 రోజులు హోస్ట్ చేసింది. ఇక నాని, రామ్ వంటి హీరోలు గెస్ట్ లు గా వచ్చారు. ఇక మొన్నటికి మొన్న పీవీ సింధు, పుల్లెల గోపీచంద్ వంటి క్రీడాకారులు కూడా సందడి చేశారు. ఇప్పుడు త్వరలోనే మెగాస్టార్ చిరంజీవిని కూడా గెస్ట్ గా తీసుకురావాలని నాగ్ ప్రయత్నిస్తున్నాడట.
ఈ మధ్యే నాగార్జున.. చిరుకి ఫోన్ చేసి అడుగగా.. దానికి చిరు కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తుంది. వీరిద్దరికి మంచి సన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. గతంలో నాగార్జున హోస్ట్ చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 1’ కి కూడా మెగాస్టార్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు. ఇప్పుడు ఎలాగూ అక్టోబర్ 2 న ‘సైరా’ విడుదల కూడా ఉంది కాబట్టి మెగాస్టార్ ఈ షో ద్వారా ప్రమోషన్ చేయొచ్చని భావిస్తున్నారని తెలుస్తుంది. ఇక ఇది కనుక నిజమైతే టీఆర్పీలు మామూలుగా ఉండవు అనడంలో ఎటువంటి సందేహం లేదు.