Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Advertisement

Cast & Crew

  • నాగ‌బాబు, గెట‌ప్ శ్రీను, ర‌వితేజ న‌న్నిమ‌ల‌ (Hero)
  • సిరి పార్వ‌తి (Heroine)
  • రీతూ చౌద‌రి, చ‌ర‌ణ్ ల‌క్క‌రాజు, కిరీటీ దామ‌రాజు త‌దిత‌రులు (Cast)
  • ప్ర‌దీప్ మ‌ద్దాలి (Director)
  • బి.వి.ఎస్‌.ర‌వి (Producer)
  • సాకేత్ కోమందూరి (Music)
  • కిషోర్ బోయిడ‌పు (Cinematography)
  • మైకేల్ డి’సెల్వా (Editor)
  • Release Date : 22nd మే 2026
  • రా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ (Banner)

నాగ‌బాబు, గెట‌ప్ శ్రీను, ర‌వితేజ న‌న్నిమ‌ల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన క్రైమ్ కామెడీ వెబ్ సిరీస్ మేము “కాప్‌”లం. ప్ర‌దీప్ మ‌ద్దాలి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సిరీస్‌ను రైట‌ర్ బీవీఎస్ ర‌వి నిర్మించారు. చ‌ర‌ణ్ ల‌క్క‌రాజు, సిరి పార్వ‌తి, రీతూ చౌద‌రి కీల‌క పాత్రల్లో క‌నిపించారు. శుక్ర‌వారం జీ5 ఓటీటీలో రిలీజైన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది? న‌వ్విస్తూనే థ్రిల్‌ను పంచిందా? లేదా అంటే?

Memu Copulam Web-Series Review

క‌థ‌: మ‌హాదేవ ప‌ట్నానికి గ‌జ‌ప‌తి రాజు (నాగ‌బాబు) చెప్పిందే వేదం. ఊళ్లో అత‌డి మాట‌కు తిరుగుండ‌దు. గ‌జ‌ప‌తిరాజు పెంపుడు పందెం కోడి స‌లార్ రాజును ఊరివాళ్లంతా ఓ సెలిబ్రిటీలా చూస్తుంటారు. కొన్నేళ్లుగా సంక్రాంతి కోడి పందాల్లో స‌లార్ రాజు వ‌రుస‌గా గెలుస్తుంటుంది. ఓ ఏడాది సంక్రాంతి కోడి పందాల‌కు కొద్ది రోజుల ముందు ఊరివాళ్లంద‌రికి గ‌జ‌ప‌తిరాజు పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలోనే స‌లార్ రాజు మిస్స‌వుతుంది. ఆ పందెం కోడిని వెతికే బాధ్య‌త‌ను మ‌హాదేవ‌ప‌ట్నం ఎస్ఐ ర‌వి సొటారితో (ర‌వితేజ న‌న్నిమ‌ల) పాటు కానిస్టేబుల్ మోహ‌న్ సొటారికి (గెట‌ప్ శీను) అప్ప‌గిస్తాడు గ‌జ‌ప‌తిరాజు. స‌లార్ రాజు మిస్సింగ్‌లో గ‌జ‌ప‌తిరాజు ప్ర‌త్య‌ర్థులైన మ‌హిపాల్ రెడ్డితో పాటు సుధాక‌ర్‌రెడ్డి ప్ర‌మేయం ఉంద‌ని ర‌వి, మోహ‌న్ అనుమానిస్తారు.

వారి అనుమానం నిజ‌మేనా? అస‌లు స‌లార్ రాజును ఎవ‌రు దొంగ‌త‌నం చేశారు? మ‌రోవైపు ఊరిలో కొంద‌రు ర‌క్త‌పు వాంతులు చేసుకొని హాస్పిట‌ల్ పాల‌వుతారు. చేత‌బ‌డులు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కోడి మిస్సింగ్ గురించిన ఇన్వేస్టిగేష‌న్‌లోనే చేత‌బ‌డుల వెన‌కున్న అస‌లు గ‌ట్టును ర‌వి, మోహ‌న్ ఎలా క‌నిపెట్టారు? పెద్ద మ‌నుషులుగా చెలామ‌ణి కొంద‌రు చేస్తోన్న అక్ర‌మ వ్యాపారాల‌కు ఈ ఇద్ద‌రు పోలీసులు ఎలా చెక్ పెట్టారు? సంఘ‌వి (సిరి పార్వ‌తి), ఆకాష్ రెడ్డి (చ‌ర‌ణ్ ల‌క్క‌రాజు)ల‌వ్‌స్టోరీ ఏమైంది? రిపోర్ట‌ర్ మీనాక్షితో (రీతూ చౌద‌రి) పాటు గిరి (కిరీటీ దామ‌రాజు) క‌థేమిటి అన్న‌దే ఈ వెబ్ సిరీస్ క‌థ‌.

న‌టీన‌టుల ప‌నితీరు: గ‌జ‌ప‌తిరాజు పాత్ర‌లో నాగ‌బాబు హుందాగా క‌నిపించారు. సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆక‌ట్టుకున్నారు. అమాయ‌క‌త్వం, అతిమంచిత‌నం క‌ల‌బోసిన ఎస్ఐ పాత్ర‌లో ర‌వితేజ న‌న్నిమ‌ల త‌న కామెడీ టైమింగ్‌తో మెప్పించారు. పంచ్‌ల‌తో న‌వ్వించారు. స్టేబుల్‌గా గెట‌ప్ శీను క్యారెక్ట‌ర్ ఈ సిరీస్‌కు హైలైట్‌గా నిలిచింది. ర‌వితేజ‌, గెట‌ప్ శ్రీను కాంబినేష‌న్‌లో వ‌చ్చే సీన్ల‌లో కామెడీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. రీతూ చౌద‌రి, కిరీటీ దామ‌రాజు పాత్ర‌ల్లో ట్విస్ట్‌లు బాగున్నాయి. చ‌ర‌ణ్ ల‌క్క‌రాజు, సిరి పార్వ‌తితో పాటు మిగిలిన వారి న‌ట‌న ఒకే.

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: వినోదం, స‌స్పెన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ ద‌ర్శ‌కుడిగా ప్ర‌దీప్ మ‌ద్దాలి ఈ సిరీస్‌ను తెర‌కెక్కించిన తీరు బాగుంది. శోభ‌న్ చిట్టిప్రోలు ఈ సిరీస్‌కు క‌థ‌, డైలాగ్స్ అందిస్తూనే చాణక్య వ‌ర్మ‌, గోపాల‌కృష్ణ విద్మ‌హేల‌తో క‌లిసి స్క్రీన్‌ప్లేను స‌మ‌కూర్చారు. మూడు బాధ్య‌త‌ల‌కు శోభ‌న్ న్యాయం చేశారు. సాకేత్ కోమందూరి మ్యూజిక్ క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా కుదిరింది. ఓవ‌ర్ బీజీఎమ్ లేకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. కోన‌సీమ అందాల‌ను సినిమాటోగ్రాఫ‌ర్ కిషోర్ బోయిడ‌పు నాచుర‌ల్‌గా చూపించారు. బీవీఎస్ ర‌వి నిర్మాణ విలువ‌లు సినిమాకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి.

విశ్లేష‌ణ‌: కోన‌సీమలో కోడి పందాల‌ పిచ్చి ఎలా ఉంటుంది? పందెం కోళ్ల పెంప‌కాన్ని త‌మ గౌర‌వానికి, హోదాకు చిహ్నంగా కొంద‌రు ఎలా భావిస్తుంటారు? సంప్ర‌దాయం పేరుతో జ‌రుగుతోన్న ఈ జూదంలో కొన్ని అసాంఘిక కార్య‌క‌లాపాలు జ‌రిగే ఆస్కారం ఉంద‌నే పాయింట్‌తో రైట‌ర్ శోభ‌న్ చిట్టిప్రోలు మేము కాప్‌లం క‌థ‌ను రాశారు. ఈ క్రైమ్ క‌థ‌ను మేము కాప్‌లం సిరీస్‌లో సీరియ‌స్‌గా కాకుండా ఎంట‌ర్‌టైనింగ్‌గా చెప్పారు డైరెక్ట‌ర్‌.

మొత్తం ఆరు ఎపిసోడ్స్‌తో మేము “కాప్‌”లం వెబ్‌సిరీస్ రూపొందింది. తొలి ఎపిసోడ్ గ‌జ‌ప‌తిరాజు, స‌లార్ రాజు పాత్రల ప‌రిచ‌యం, పందెం కోడి మిస్సింగ్ చుట్టూ తిరుగుతుంది. స‌లార్ రాజు మిస్స‌వ్వ‌డం, ఈ కోడిని వెతికి పెట్ట‌డానికి ర‌వి, మోహ‌న్ రంగంలోకి దిగిన‌ప్ప‌టి నుంచి సిరీస్ కామెడీలోకి షిప్ట‌వుతుంది.

త‌మ అతి తెలివితేట‌ల‌తో ర‌వి మోహ‌న్ వేసిన‌ ప్లాన్స్ బెడిసికొట్టి వారే చిక్కుల్లో ప‌డే సీన్లు న‌వ్విస్తాయి. వారి ఇన్వేస్టిగేష‌న్‌, సీన్ రీక‌న్‌స్ట్ర‌క్ష‌న్ పేరుతో చేసే హ‌డావిడి ఆక‌ట్టుకుంటుంది. కోడి మిస్సింగ్ వెన‌కున్న‌ది ఎవ‌ర‌న్న‌ది రివీల్ కాకుండా ఒక్కొక్క‌రిపై అనుమానాన్ని రేకెత్తిస్తూ చివ‌రి వ‌ర‌కు స‌స్పెన్స్ మెయింటేన్ చేశారు డైరెక్ట‌ర్‌. అస‌లు దొంగ ఎవ‌ర‌నే ట్విస్ట్‌ను ఫ‌న్నీగా రాసుకున్నారు.

చేత‌బ‌డుల అంశాన్ని కూడా బాగా వాడుకున్నారు. ఊరిని పెద్ద ప్ర‌మాదం నుంచి ర‌వి, మోహ‌న్ ఎలా కాపాడారు? విల‌న్స్ వేసిన ఎత్తుల‌ను ఏ విధంగా తిప్పికొట్టారు? అస‌మ‌ర్థులు అంటూ హేళ‌న చేసిన గ‌జ‌ప‌తిరాజును ఎలా మెప్పించార‌న్న‌ది న‌వ్విస్తూనే థ్రిల్లింగ్‌గా చూపించారు.

గ‌జ‌ప‌తిరాజు పందెం కోళ్ల‌కు బాహుబ‌లి రాజు, స‌లార్ రాజు, క‌ల్కి రాజు అంటూ ప్ర‌భాస్ సినిమాల పేర్ల‌ను పెట్ట‌డం బాగుంది. కాన్సెప్ట్ బాగున్నా కామెడీ అనుకున్న స్థాయిలో పండ‌లేదు. ర‌వి, మోహ‌న్ ఇన్వేస్టిగేష‌న్ సీన్లు రిపీటెడ్ ఫీలింగ్‌ను క‌లిగిస్తాయి. క‌థ ముందుకు క‌ద‌ల‌క అక్క‌డే తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. సంఘ‌వి, ఆకాష్ ల‌వ్‌స్టోరీతో పాటు అబ్బా ఎపిసోడ్‌ను బ‌ల‌వంతంగా క‌థ‌లో ఇరికించారు. వాటికి ప్రాప‌ర్ ఎండింగ్ కూడా చూపించ‌లేదు. విల‌న్స్‌ ఎవ‌ర‌న్న‌ది రివీల‌య్యే సీన్ల‌ను ఇంకాస్త థ్రిల్లింగ్‌గా రాసుకుంటే బాగుండేది.

ఫోక‌స్ పాయింట్‌: మేము కాప్‌లం స‌ర‌దాగా సాగే ఫ‌న్ క్రైమ్‌ థ్రిల్ల‌ర్ సిరీస్‌.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus