“హిట్, లక్కీ భాస్కర్” సినిమాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న శ్రీనాథ్ మాగంటి హీరోగా తనను తాను పరిచయం చేసుకుంటూ నటించిన చిత్రం “మెన్షన్ హౌస్ మల్లేష్”. బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కొన్నాళ్లపాటు ప్రొడక్షన్ లో ఉండి, సినిమా కష్టాలన్నీ చవిచూసి ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. మరి శ్రీనాథ్ హీరోగా నిరూపించుకున్నాడా? మల్లేష్ గాడి బాధ ఏంటి? అనేది చూద్దాం..!!
కథ: చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుని, తండ్రి విడిచి చచ్చిపోయిన మందుకు అలవాటుపడి, నాటుగా పెరుగుతాడు మల్లేష్ (శ్రీనాథ్ మాగంటి). రోజుకో రెండుమూడు మెన్షన్ హౌస్ బాటిల్స్, ఊర్లో టెంట్ హౌస్, ఇంట్లో తల్లి, ఒక బాల్య స్నేహితుడు తప్ప వేరే ప్రపంచం తెలియదు మల్లేష్ కి. అలాంటోడి జీవితంలోకి వస్తుంది జ్యోతి (గాయత్రి రమణ).
కట్ చేస్తే మొదటిరాత్రి రోజే తాను ఊరంతా చెప్పుకునే స్థాయి మగాడు, మొనగాడు కాదని తెలుస్తుంది మల్లేష్ కి. ఆ తర్వాత తన సమస్యని ఎలా పరిష్కరించుకున్నాడు? పరువు ఎలా కాపాడుకున్నాడు? అనేది “మెన్షన్ హౌస్ మల్లేష్” కథాంశం.
నటీనటుల పనితీరు: శ్రీనాథ్ ని ఇప్పటివరకు క్యారెక్టర్ రోల్స్ లో చూసిన విధానానికి పూర్తి భిన్నంగా మల్లేశ్ గా కనిపించాడు. మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్, లుక్స్, యాస వంటి అన్ని విషయాల్లో శ్రద్ధ చూపించాడు. అందువల్ల మల్లేష్ అనే పాత్రని మాత్రమే తెరపై చూస్తాం.
మొదటి సినిమా అయినా గాయత్రి రమణ మంచి మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా సెన్సువాలిటీని గ్రేస్ ఫుల్ గా ప్రాజెక్ట్ చేసిన తీరు బాగుంది. క్లాసిక్ డ్యాన్సర్ అవ్వడం వల్ల కళ్ళల్లో పలికించిన హావభావాలు స్పష్టంగా కనిపించాయి.
కామాక్షి భాస్కర్ల మొదట్లో ఏదో రెగ్యులర్ సపోర్టింగ్ రోల్ అన్నట్లుగా ఉంటుంది కానీ.. సెకండాఫ్ లో వచ్చే బుల్లెట్ బైక్ సీన్ & పోలీస్ స్టేషన్ సీన్ లో మాత్రం అదరగొట్టింది.
రాజ్ కుమార్ కసిరెడ్డి కామెడీ టైమింగ్ బాగా వర్కవుట్ అయ్యింది. ముఖ్యంగా శ్రీనాథ్-కసిరెడ్డి కాంబినేషన్ జోకులు గట్టిగా పేలాయి. మురళీధర్ గౌడ్ ఈ తరహా పాత్రల్లో జీవించేస్తాడు. నిర్మాత రాజేష్ సినిమాలో కీలకపాత్ర పోషించాడు. లుక్స్ వరకు దిట్టమైన తెలంగాణ వ్యక్తిగా కనిపించాడు కానీ.. నటుడిగా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.
“కొత్త పోరడు” వెబ్ సిరీస్ ఫేమ్ సాయి ప్రసన్న పనిమనిషి పాత్రలో హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసింది.
సాంకేతికవర్గం పనితీరు: అమ్మ ముత్తు సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాని బాగా ఎలివేట్ చేసింది. కలర్ టోన్ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. సినిమాలో ఎమోషన్ బట్టి కలరింగ్ చేస్తే ఆడియన్స్ కి ఇంకాస్త బెటర్ కనెక్టివిటీ ఉండేది.
సురేష్ బొబ్బిలి సంగీతంలో రీజనాలిటీని కమర్షియాలిటీని మిక్స్ చేసిన విధానం ఆకట్టుకుంది. మోగొడ్నిరా ర్యాప్ సాంగ్, బంగారి సాంగ్ & నేపథ్య సంగీతం బాగా కుదిరాయి.
దర్శకుడు బాల సతీష్ ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ ని, చాలా సెన్సిబుల్ గా డీల్ చేశాడు. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ & వరల్డ్ బిల్డింగ్ లో తీసుకున్న కేర్ బాగుంది. మరీ ముఖ్యంగా.. రొమాంటిక్ సీన్స్ ని డీల్ చేసిన విధానం అభినందనీయం. ఎవ్వరు ఇబ్బందిపడకుండా.. రేడియో & పాత పాటల రిఫరెన్సులతో సదరు సన్నివేశాల్ని అర్థవంతంగా కంపోజ్ చేసిన విధానం ఎంగేజ్ చేసింది. అందరూ ఆ రేడియో ఎప్పుడు కరెక్ట్ గా వర్క్ చేస్తుందా అని ఎదురుచూశారు అంటేనే.. దర్శకుడిగా ఎంత ఇంపాక్ట్ ఫుల్ గా రాసుకున్నాడు/తీశాడు అనేది అర్థం చేసుకోవచ్చు.
అయితే.. ఫస్టాఫ్ ఎంత బాగా వర్కవుట్ అయ్యిందో, సెకండాఫ్ అంతే డల్ అయిపోయింది. ముఖ్యంగా సినిమాలో గాంజా ఎపిసోడ్ & బావ-బావమరిదిలా మధ్య కెమిస్ట్రీ సీన్స్ కథని డీవియేట్ చేసాయి. ఆ విషయాల్లో కేర్ తీసుకుని ఉంటే ఒక సంతృప్తినిచ్చేది. అందువల్ల.. దర్శకుడు బాల సతీష్ పూర్తిస్థాయిలో అలరించలేకపోయినా, రైటర్/మేకర్ గా మాత్రం ఆకట్టుకున్నాడు. ఇంకాస్త బెటర్ రైటింగ్ ఉంటే మాత్రం కచ్చితంగా దర్శకుడిగా సక్సెస్ అయ్యే సత్తా బాల సతీష్ కి పుష్కలంగా ఉంది.
విశ్లేషణ: అంగ స్తంభన లాంటి టబూ టాపిక్ ని సినిమా కథాంశంగా తీసుకోవడమే పెద్ద రిస్క్. ఇదివరకు “ఏక్ మినీ కథ” చిత్రంలో మూలకథ అంగం కొలత గురించి అయినప్పటికీ, కంప్లీట్ గా కామెడీతో లాగించేశారు. అయితే.. “మెన్షన్ హౌస్ మల్లేష్” చిత్రంలో ఆ టాపిక్ ని సెన్సిబుల్ గా, ఎమోషనల్ గా డీల్ చేసిన విధానం బాగున్నా.. కథనంలో వచ్చిన కొన్ని డీవియేషన్లు సెకండాఫ్ లో సినిమాని గాడి తప్పించాయి. అయితే.. డైరెక్టర్ బాల సతీష్ సెన్సిబిలిటీస్, శ్రీనాథ్ మాగంటి-గాయత్రి రమణ ఆర్గానిక్ పెర్ఫార్మెన్స్, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ కోసం కచ్చితంగా థియేటర్లో చూడదగ్గ చిత్రం “మెన్షన్ హౌస్ మల్లేష్”.
ఫోకస్ పాయింట్: మొదటి సగంలో ఉన్న మజా మలిసగంలో మిస్ అయ్యింది మల్లేష్!
రేటింగ్: 2.5/5