తమిళ హీరో సూర్య కి తమిళనాడు లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువమంది అభిమానులున్నారు. తమిళంలో మాదిరిగానే ఇక్కడ కూడా అతని చిత్రాలు భారీ కలక్షన్స్ రాబడుతుంటాయి. అలాగే తన సినిమా కేరళలోను వసూళ్లు రాబట్టాలని మంచి ప్లాన్ వేశారు. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తో కలిసి సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం సూర్య సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎన్జీకే (NGK) మూవీ చేస్తున్నారు. దీని తర్వాత తనకి వీడొక్కడే, బ్రదర్స్ సినిమాలు అందించిన కె.వి. ఆనంద్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో ఓ కీలక పాత్ర ఉంది. అందుకు తమిళ నటులు ఎందరో సూటవుతారు.
అయినా మోహన్ లాల్ అయితే మరింత బాగుంటుందని అతన్ని ఎంపిక చేశారు. సూర్యతో కలిసి నటించడానికి మోహన్ లాల్ కూడా ఉత్సాహంగా ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా నిర్మించనుంది. ఈ మూవీ ఒకే సారి మూడు భాషల్లో రిలీజ్ చేయడానికి స్క్రిప్ట్ దశ నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఏడాది యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోహన్ లాల్ తో కలిసి జనతా గ్యారేజ్ సినిమా చేశారు. ఆ మూవీతో మల్లూవుడ్ లో తారక్ అడుగుపెట్టారు. మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు సూర్య ఎంతమేర కేరళవాసులను మెప్పిస్తారో చూడాలి.