Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • శ్రీవిష్ణు (Hero)
  • రెబా మోనికా జాన్ (Heroine)
  • వీర్ ఆర్యన్, రచ్చ రవి, సుదర్శన్, అయ్యప్ప శర్మ, బాలాదిత్య తదితరులు (Cast)
  • శ్రీ హుస్సేన్ షా కిరణ్ (Director)
  • సందీప్ గుణ్ణం - వినయ్ చిలకపాటి (Producer)
  • కాలభైరవ (Music)
  • విద్యాసాగర్ చింతా (Cinematography)
  • శ్రీకర్ ప్రసాద్ (Editor)
  • Release Date : మార్చి 06, 2026
  • లైట్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ (Banner)

వరుసబెట్టి కామెడీ ఎంటర్టైనర్లతో, సెన్సార్ వారికి సైతం చిక్కని డైలాగులతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న శ్రీవిష్ణు తన పంథాను పక్కనపెట్టి చేసిన ప్రయత్నం “మృత్యుంజయ్”. శ్రీ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రెబా మోనికా జాన్ కీలకపాత్ర పోషించింది. గతవారమే విడుదలవ్వాల్సిన ఈ చిత్రం ఇంటర్నల్ సెటిల్మెంట్స్ పుణ్యమా అని నేడు (మార్చి 06) విడుదలైంది. మరి ఈ థ్రిల్లర్ తో శ్రీవిష్ణు ప్రేక్షకుల్ని అలరించగలిగాడా? లేదా? అనేది చూద్దాం..!!

Mrithyunjay Movie Review

కథ: మృత్యుంజయ్ అలియాస్ జయ్ (శ్రీవిష్ణు) స్వేచ్ఛ అనే దినపత్రికలో శ్రద్ధాంజలి ప్రకటనలు రికార్డ్ స్థాయిలో వేయిస్తూ ఎండీ మన్ననలు అందుకుంటాడు. అయితే.. క్రైమ్ బ్యూరోలో జాయినవ్వాలన్న అతని కోరిక మాత్రం ఎందుకో నెరవేరదు. అలా ఓ సంస్మరణ యాడ్ కోసం వెళ్లిన జయ్ కి, అక్కడ చోటు చేసుకున్న మరణం యాక్సిడెంట్ కాదని, ఎవరో కావాలని ప్లాన్ చేసి మరీ చేసిన హత్య అని అర్ధమవుతుంది కానీ.. నిరూపించలేడు.

అయితే.. ఆ కిల్లర్ మాత్రం జయ్ ఉనికిని కనిపెట్టి, అతడ్ని చంపడానికి రంగంలోకి దిగుతాడు విలన్.

ఎవరా విలన్? ఎందుకని హత్యలు చేస్తుంటాడు? జయ్ ని ఎందుకు చంపడానికి సిద్ధమవుతాడు? ఈ పద్మవ్యూహం నుండి జయ్ ఎలా బయటపడ్డాడు? వంటి ప్రశ్నలకి సమాధానమే “మృత్యుంజయ్” చిత్రం.

నటీనటుల పనితీరు: గత నాలుగైదేళ్లుగా శ్రీవిష్ణుని కామెడీ సినిమాల్లో చూసి, నటుడిగా అతడి పొటెన్షియల్ ని పెద్దగా పట్టించుకోలేదు ప్రేక్షకులు. తన మొదటి సినిమా “ప్రేమ ఇష్క్ కాదల్”, తర్వాతి సినిమాలైన “నీది నాదీ ఒకే కథ, అప్పట్లో ఒకడుండేవాడు” తరహాలో సిన్సియర్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇలాంటి థ్రిల్లర్స్ లో కళ్ళతో నటించాల్సి ఉంటుంది, ముఖ్యంగా శోధించే సన్నివేశాల్లో చాలా చాకచక్యంగా వ్యవహరించాలి. అలాంటి విషయాల్లో శ్రీవిష్ణు తన సిన్సియారిటీని ప్రూవ్ చేసుకున్నాడు.

నెగిటివ్ రోల్ ప్లే చేసిన వీర్ ఆర్యన్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. స్టైలైజ్డ్ విలనిజం పండించడంలో అతని లుక్స్ కీ రోల్ ప్లే చేయగా, ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియన్స్ ను ఎంగేజ్ చేయగలిగాడు.

రెబా మోనికా జాన్ నిజానికి హీరోయిన్ అనలేం. ఆమె కూడా సినిమాలో ఓ పాత్రధారి మాత్రమే. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కానీ, ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లభించలేదు.

రచ్చ రవి మరోమారు ఒక మంచి పాత్రలో అలరించాడు. అయ్యప్ప శర్మ, సుదర్శన్ ల స్థాయిలోనే రచ్చరవి పాత్ర, నటన ఉండడం అనేది గమనార్హం. “ఛాంపియన్” తర్వాత రవికి ఇది మరో మెట్టు లాంటిది.

బాలాదిత్య పాత్ర చాలా చిన్నదే అయినప్పటికీ.. మంచి ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే.. చిన్నారి పాత్ర పోషించిన పాప కూడా చక్కగా ఒదిగిపోయింది.

సాంకేతికవర్గం పనితీరు: విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి మెయిన్ ఎస్సెట్. ఫ్రేమింగ్ కి చాలా ప్రాముఖ్యత ఉన్న సినిమా ఇది. మోండా మార్కెట్ & క్లైమాక్స్ రైన్ ఫైట్ ను కంపోజ్ చేసిన విధానం బాగుంది. అలాగే.. సినిమా క్వాలిటీ & కలరింగ్ సినిమా మూడ్ ని ఎలివేట్ చేసింది.

కాలభైరవ నేపథ్య సంగీతం థ్రిల్స్ & ఎమోషన్ ను సరైన మీటర్ లో ఎలివేట్ చేసింది. సౌండ్ డిజైన్ డిపార్ట్మెంట్ కూడా కంటెంట్ ని క్వాలిటీతో ప్రెజెంట్ చేసింది. ప్రొడక్షన్ టీమ్ డబ్బులు వేస్ట్ చేయకుండా, లిమిటెడ్ లొకేషన్స్ & బ్యాగ్రౌండ్ వర్క్ తో సినిమాకి హెల్ప్ అయ్యారు.

దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ ఒక సిన్సియర్ థ్రిల్లర్ ని ప్రేక్షకులకి అందించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే.. చిక్కుముడులు వీడే సందర్భాలు కాస్త పేలవంగా ఉన్నాయి. ఆ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే ఆడియన్స్ కి ఇంకాస్త బెటర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేది. మూలకథలో నవ్యత ఉన్నా.. స్క్రీన్ ప్లే లేదా స్టోరీ ప్యాటర్న్ కొన్ని ఫారిన్ సినిమాలని గుర్తుచేసింది. “యాక్సిడెంట్ (2009), జాక్ రీచర్ (2012)” వంటి సినిమాల తాలూకు ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది.

అయితే.. పాప ఎమోషన్ కొత్తదనాన్ని తీసుకొచ్చింది. థ్రిల్లర్ లో ఎమోషన్ ను మిళితం చేసి హ్యాండిల్ చేసిన విధానం ప్రశంసార్హం. మరీ ముఖ్యంగా అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయకుండా సినిమాని స్ట్రయిట్ టు ది పాయింట్ నడిపాడు. ఓవరాల్ గా.. మొదటి సినిమా “మీకు మీరే మాకు మేమే”తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడంలో విఫలమైన హుస్సేన్ షా కిరణ్ రెండో సినిమా “మృత్యుంజయ్”తో మాత్రం ఆడియన్స్ ను ఎంగేజ్ చేసి హిట్టు కొట్టాడని చెప్పొచ్చు.

విశ్లేషణ: హీరోకి ఎలివేషన్లు, అవసరం లేకుండా మధ్యలో వచ్చే లవ్ ట్రాక్ లు, సందర్భం లేని సాంగ్స్ లేకుండా తెలుగులో ఒక సినిమా చూసి చాలా రోజులైంది. ఆ వెలితిని తీర్చిన సినిమా “మృత్యుంజయ్”. శ్రీవిష్ణు సిన్సియర్ పెర్ఫార్మెన్స్, హుస్సేన్ షా కిరణ్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, కాలభైరవ థ్రిల్లింగ్ బీజీయం & విద్యాసాగర్ ఎఫెక్టివ్ సినిమాటోగ్రఫీ వర్క్ కోసం “మృత్యుంజయ్”ను కచ్చితంగా థియేటర్లో చూడాలి.

ఫోకస్ పాయింట్: డీవియేషన్లు లేని సిన్సియర్ థ్రిల్లర్!

రేటింగ్: 3/5

 

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus