టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్ ఒకటి. ఇప్పటివరకు నిర్మాణానికి మాత్రమే పరిమితమైన మైత్రి సంస్థ ఇప్పుడు సొంతంగా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. సినిమాలను నిర్మించడమే కాకుండా.. డబ్బింగ్ సినిమాలను కూడా రిలీజ్ చేస్తోంది. అందులో భాగంగానే ‘కోనసీమ థగ్స్’ అనే సినిమాను ఈ నెల 24న విడుదల చేయబోతున్నారు. ఆ రోజున తెలుగులో చెప్పుకోదగ్గ రిలీజ్ లు లేవు. ఆ అవకాశాన్ని వాడుకోవడానికి మైత్రి నిర్మాతలు రెడీ అయ్యారు.
జైలు బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటీనటులు పెద్దగా లేరు. ఒక్క బాబీ సింహా మాత్రమే ఉన్నారు. హ్రిదు హరూన్ హీరోగా నటించిన ఈ సినిమాలో క్యాస్టింగ్ ఓ రేంజ్ లో ఉంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. డేంజరస్ రౌడీలంతా ఒకే జైలులో కలుసుకుంటారు. అక్కడి పరిస్థితులు రోజుకో మలుపు తీసుకుంటూ ఉంటాయి. పేరుకి జైల్లో ఉన్నప్పటికీ.. బయట దందాలను నడిపిస్తూనే ఉంటారు.
ఈ రౌడీ బ్యాచ్ మొత్తం అందరూ కలిసి జైలు నుంచి తప్పించుకుపోవడానికి ప్లాన్ చేస్తారు. పోలీసుల కళ్లుగప్పి ఈ బ్యాచ్ ఏం చేశారనే పాయింట్ మీద ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకి సామ్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ బృంద ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. దర్శకురాలిగా ఆమెకిది డెబ్యూ. ఇక మైత్రి సంస్థ విషయానికొస్తే..
నిర్మాణం, పంపిణీ రెండూ బ్యాలెన్స్ చేసేలా పక్కా ప్లానింగ్ ప్రకారం సిద్ధమవుతున్నారట. తమ ప్రొడక్షన్ నుంచి వచ్చేవి డబ్బింగ్ సినిమాలు అయినప్పటికీ.. ప్రమోషన్స్ తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నారు. ప్లానింగ్ అయితే బాగానే ఉంది. మరి సినిమా ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!