అక్కినేని వారింట త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయన్న సంగతి కొంతకాలంగా వినిపిస్తున్నదే. ఇక నాగచైతన్య భార్య ఎవరన్న విషయమూ బహిరంగ రహస్యంగా మారింది. ఇటీవల నాగ్ సైతం ఈ విషయమై పెదవి విప్పి త్వరలోనే అధికారికంగా ప్రకటనిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో ఆ ఇళ్ళు పసుపు పచ్చ శోభతో ముస్తాబవడానికి సిద్ధమైంది. మరిప్పుడు ఎవరో తమకు అడ్డు చెబుతున్నట్టు ‘నిన్నే పెళ్లాడతా’ అని చైతూ ఎందుకంటున్నాడు..? అంటే దానికో కథ ఉంది మరి.
ఈ ఏడాది పెద్ద పండగకి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అంటూ నాగార్జునతో చిందులేయించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగ చైతన్య ఓ సినిమా చేయనున్న ముచ్చట తెలిసిందే. త్వరలో సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ సినిమాకి టైటిల్ గా ‘నిన్నే పెళ్లాడతా’ను ఖరారు చేసే దిశగా ఆలోచన చేస్తున్నారట. నాగార్జున – కృష్ణవంశీ కలయికలో వచ్చిన ఈ సినిమా నాగ్ కెరీర్లోనే ఓ సూపర్ హిట్ సినిమా. పైగా కళ్యాణ్ తొలి సినిమాలానే రెండో సినిమాని రొమాంటిక్ ఎంటర్టైనర్ గానే తెరకెక్కిస్తున్నాడట దర్శకుడు. దాంతో నాగ్ సినిమా టైటిల్ పరిశీలనలోకి వచ్చింది. దీనిపై తుది నిర్ణయం ఏమిటన్నది తెలియాల్సి ఉంది.