రజినీకాంత్, (Rajinikanth) నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) కలయికలో వచ్చిన ‘జైలర్’ సంచలన విజయం సాధించడంతో, దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’పై మొదట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా చుట్టూ ప్రస్తుతం పెద్దగా సందడి కనిపించడం లేదు. విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడమే కాకుండా, చిత్ర యూనిట్ సైతం ప్రచార కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉండటం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi) సుమారు రూ.35 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకున్నారు. సాధారణంగా చిన్న చిత్రాలకైనా దూకుడుగా పబ్లిసిటీ ప్లాన్ చేసే ఆయన, ఇంత భారీ పెట్టుబడి పెట్టిన ఈ సినిమాకు కనీసం ప్రీ-రిలీజ్ వేడుక కూడా నిర్వహించకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే, ఆయన మౌనం వెనుక వేరే లెక్కలు ఉన్నాయనే గుసగుసలు ఫిలింనగర్లో గట్టిగా వినిపిస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్, నెల్సన్ కాంబినేషన్లో నాగవంశీ ఒక భారీ ప్రాజెక్టును ప్లాన్ చేశారు. కానీ, తారక్ తాజా షెడ్యూల్స్ కారణంగా ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. నాగవంశీకి చెందిన హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ లోనే త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమా రూపొందనుంది. అది పాన్ ఇండియా సినిమా. కాబట్టి 2 ఏళ్ళు ఈజీగా పట్టేస్తుంది. అంతవరకు దర్శకుడు నెల్సన్‌ను హోల్డ్‌లో ఉంచేందుకే, రిస్క్ అని తెలిసినా నాగవంశీ ‘జైలర్ 2’ హక్కులను కొనుగోలు చేశారనే టాక్ నడుస్తోంది.