మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. వీరి స్నేహబంధం గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. వీరిద్దరూ కలిసి వ్యాపారాలు కూడా చేశారు. అలాంటి స్నేహితులు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధపడుతున్నారు. దసరా కానుకగా వీరు నటించిన సినిమాలు ‘గాడ్ ఫాదర్’, ‘ది ఘోస్ట్’ తలపడబోతున్నాయి. ఈ రెండు సినిమాలు అక్టోబర్ 5నే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మధ్యలో ఈ సినిమాల మధ్య క్లాష్ లేకుండా.. రిలీజ్ డేట్లు మారుతున్నట్లు ప్రచారం జరిగింది.
కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఇరు చిత్రాల దర్శకనిర్మాతలు అక్టోబర్ 5న తమ సినిమాలు రిలీజ్ అవుతాయని వెల్లడించారు. అయితే గత రెండు దశాబ్దాల్లో చిరు, నాగార్జున పోటీ పడింది లేదు. ఇప్పుడు ఇద్దరూ తలపడుతుండడంతో ఇబ్బందికర వాతావరణం నెలకొంటుందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ క్లాష్ ను ఇద్దరు హీరోలు ప్రొఫెషనల్ గానే చూస్తున్నట్లున్నారు. చిరంజీవి ఇంకా ‘గాడ్ ఫాదర్’ ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు కానీ..
నాగార్జున ‘ది ఘోస్ట్’ ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమంలో మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. చిరంజీవితో క్లాష్ గురించి మాట్లాడారాయన. చిరంజీవిని చాలా మంది ఇష్టపడతారని.. రెండు సినిమాల రిలీజ్ కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. దసరా సమయంలో రెండు, మూడు సినిమాలు రిలీజ్ కావడమనేది గత నలభై ఏళ్లుగా జరుగుతోందని.. సినిమా బాగుంటే ఎన్ని విడుదలైనా ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు నాగార్జున. మరి ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాయో చూడాలి!