మా సినిమా గురించి నెగిటివ్‌గా ఎవరూ మాట్లాడొద్దు అని గతంలో చాలామంది దర్శకనిర్మాతలు చెప్పేవారు. తామొక మంచి సినిమా తీశామని, సినిమా చూశాక అందరూ మాట్లాడాలి అని కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి మాటలు, సినిమాలను మనం చాలానే చూశాం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తమ సినిమా గురించి ఎవరూ ఏమీ మాట్లాడొద్దని కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ‘ది ప్యారడైజ్’ సినిమా కూడా ఇదే పని చేసింది.
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని బెంగళూరు సివిల్ కోర్టుకు ఆ సినిమా నిర్మాణ సంస్థ ఎస్‌ఎల్‌వీ సినిమాస్ సంస్థ వెళ్లింది. ఆగస్టు 6న సినిమా టీజర్ విడుదలైనప్పట నుండి కొంతమంది సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడుతున్నారు. దీనివల్ల సినిమా ప్రతిష్ఠతో పాటు వసూళ్లు దెబ్బతింటాయని సినిమా నిర్మాణ సంస్థ ఆ పిటిషన్‌లో రాసుకొచ్చింది.
దీనిపై విచారణ చేపట్టి న్యాయస్థానం కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన అదనపు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు చిత్ర బృందానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. నిర్మాతలు సమర్పించిన ఆధారాలను పరిశీలిస్తే ఆ పోస్టులు సినిమా కమర్షియల్ విలువను తగ్గించేలా ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. సంబంధిత పోస్టులు, లింకులను వెంటనే తొలగించాలని సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 28కి వాయిదా వేసింది.
అయితే, ఈ విషయంలో హీరో నాని స్పందన వేరే విధంగా ఉంది. కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఒరిజినల్ రివ్యూల విషయంలో కాదని.. బాట్స్‌తో అలాంటి రివ్యూలు పెడుతున్న సోషల్ మీడియా పేజీలకు అని తేల్చి చెప్పాడు. కంప్యూటర్ జనరేటడ్ రివ్యూల వల్ల ఇబ్బందులు పడుతున్నామనే తమ నిర్మాత కోర్టుకు వెళ్లారని నాని చెప్పాడు.