Navarasa Review: నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

లాక్ డౌన్, థియేటర్ల మూసివేత కారణంగా ఉపాధి కోల్పోయిన కొన్ని వేల మంది తమిళ సినీ కార్మికుల ఉపాధి కోసం తమిళ చిత్రసీమ మొత్తం ఏకమై రూపొందించిన వెబ్ సిరీస్ “నవరస”. మణిరత్నం-జయేంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ 9 ఎపిసోడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. తమిళ చిత్రసీమకు చెందిన ప్రముఖ తారాగణం అందరూ నటించిన ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం..!!

1. కరుణ రసం:


బిజోయ్ నంబియార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, రేవతి కీలకపాత్రల్లో రూపొందిన ఈ ఎపిసోడ్ “కరుణ” నేపధ్యంలో తెరకెక్కింది. తన భర్త మరణానికి కారణం తానే అని బాధపడే ఒక భార్య, ఒక మనిషిని చంపినదానికంటే.. అలా చంపగా చూసిన మహిళ తనను ఎందుకు ఆపలేదు అని మదనపడే ఓ వ్యక్తి. ఈ ఇద్దరి మధ్య సాగే ఎమోషనల్ సాగా ఈ ఎపిసోడ్. కథగా చెప్పడానికి చాలా సింపుల్ గా ఉన్నా.. చక్కని ఎమోషన్ ఉంటుంది. ఆ కారణంగా ఎపిసోడ్ లోని భావం స్పష్టంగా కనిపిస్తుంది. గోవింద్ వసంత నేపధ్య సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

2. హాస్య రసం:


ప్రఖ్యాత తమిళనాడు మంత్రిగారి జీవితంలో జరిగిన యదార్ధ అంశాన్ని కథనంగా ఎంచుకొని ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ ఎపిసోడ్ పేరుకు తగ్గట్లు హాస్యం పండించకపోయినా.. ఓ మోస్తరుగా పర్వాలేదు అనిపిస్తుంది. యోగిబాబు స్క్రీన్ ప్రెజన్స్ ను దర్శకుడు సరిగా వినియోగించుకోలేకపోయారనే చెప్పాలి. అయితే.. ఆర్ట్ డిపార్ట్ మెంట్ 90ల కాలాన్ని రీక్రియేట్ చేయడంలో సఫలీకృతమయ్యారు.

3. అద్భుత రసం:


సిరీస్ మొత్తంలో పేరుకు తగ్గట్లు ఏదైనా ఎపిసోడ్ ఉంది అంటే.. అది ఈ “ప్రొజెక్ట్ అగ్ని” మాత్రమే. నిజంగానే అద్భుతంగా ఉంది. కార్తీక్ నరేన్ దర్శకత్వంలో అరవింద్ స్వామి-ప్రసన్న నడుమ సాగే సాధారణ సంభాషణ మానవాళి ఉనికిని ప్రశ్నిస్తుంది. అన్నిటికీ మించి కార్తీక్ నరేన్ సీన్ కంపోజిషన్స్ అద్భుతం. ప్రతి నటుడ్ని పూర్తిస్థాయిలో వినియోగించుకున్నాడు. సిరీస్ మొత్తానికి బెస్ట్ ఎపిసోడ్ గా దీన్ని పేర్కొనవచ్చు.

4. భీభత్స రసం:


మనిషిలోని అహంభావం వయసుతో సంబంధం లేకుండా ఎంత నీచ స్థాయికి దిగజారేలా చేస్తుందో తెలియజేసే ఎపిసోడ్ ఇది. వసంత్ దర్శకత్వం వహించిన ఈ ఎపిసోడ్ లో ఢిల్లీ గణేష్, అదితి బాలన్, రోహిణి కీలక పాత్రలు పోషించారు. ఎపిసోడ్ మొత్తం చూశాక.. చెప్పిన పాయింట్ బాగానే ఉంది కానీ.. దానికి ఇంత పెద్ద కాన్వాస్ ఎందుకు అనిపిస్తుంది.

5. శాంత రసం:


నవరసాల్లో శాంతి అనేది ఉంటుంది కానీ.. ప్రపంచంలో శాంతి అనేది ఉండదు అని థిమేటిక్ గా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ ఎపిసోడ్ తో తెలుస్తుంది. బాబీ సింహా, గౌతమ్ మీనన్ క్యాస్టింగ్ బాగోకపోయినా.. చెప్పిన కంటెంట్ బాగుండడం ప్లస్.

6. రౌద్ర రసం:


కోపం పర్యవసానాలు ఎలా ఉంటాయి? అని తెలియజెప్పే ఎపిసోడ్ ఇది. నటుడు అరవింద స్వామి ఈ ఎపిసోడ్ ను డైరెక్ట్ చేయడం మరో విశేషం. తమిళ నటుడు శ్రీరామ్ జీవించేసిన ఎపిసోడ్ ఇది. బాల నటుడిగానే నేషనల్ అవార్డ్ అందుకున్న శ్రీరామ్ కి ఇది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ.. అతడి హావభావాల ప్రకటన ప్రేక్షకుల మనసుల్లోకి చొచ్చుకుపోతుంది. ముఖ్యంగా అతడి ఆక్రోశాన్ని ప్రేక్షకుడు కూడా ఫీల్ అవుతాడు.

7. భయానక రసం:


ప్రేమ-పగ-నమ్మకం-ద్రోహం ఈ ఎమోషన్స్ అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యుంటాయి. అందుకు కారణాలు ఏవైయా కావచ్చు. కానీ.. వాటి మధ్య దూరం మాత్రం ఒక సన్నని గీత మాత్రమే. ఆ గీతను గుర్తించిన వారు ఏమీ లేకపోయినా సుఖంగా ఉంటారు. గుర్తించలేని వారు అన్నీ ఉన్నా సంతోషంగా ఉండలేరు. సిద్ధార్ధ్-పార్వతీల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ ఎపిసోడ్ అందుకు ఉదాహరణ. నిజానికి మంచి స్కోప్ ఉన్న కథ, అయితే.. ఉన్న టైమ్ ఫ్రేమ్ లో దాన్ని పూర్తిస్థాయిలో ఎలివేట్ చేయలేకపోయారు.

8. వీర రసం:


కొన్ని ఆలోచనలు ఆచరణ రూపంలో విఫలమవుతాయి అనేందుకు ఈ ఎపిసోడ్ చక్కని ఉదాహరణ. వీరత్వం అనేది సమాజానికి ఓ అలంకారం మాత్రమే కానీ.. నిజజీవితంలో పనికిరాదని చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నా.. సింబాలిక్ గా చెప్పడంలో విఫలమయ్యాడు సర్జున్. అథర్వ-అంజలి-కిషోర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ ఎపిసోడ్. ఆకట్టుకోలేక, అలరించలేక మదనపడుతుంటుంది.

9. శృంగార రసం:


సూర్య నటించగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎపిసోడ్ అన్నిటికంటే.. బోరింగ్ ఎపిసోడ్. హీరోహీరోయిన్లు మాట్లాడుకుంటూ ఉంటే మనం వాళ్ళ ముందు అనవసరంగా కూర్చున్న భావన కలుగుతుంది. అసలు కథ-కథనం అనేది లేకుండా కేవలం మాటలతోనే సిరీస్ మొత్తం సాగదీసేశాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. సూర్య-ప్రగ్య మార్టిన్ స్క్రీన్ ప్రెజన్స్ & కెమిస్ట్రీ అద్భుతంగా ఉన్నా.. ఎపిసోడ్ గా మాత్రం శృంగార రసం నీరసం తెప్పిస్తుంది.

విశ్లేషణ: ఈ సిరీస్ కి పనిచేసిన, నటించిన వాళ్ళందరూ ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ తీసుకోకుండా పనిచేయడం అనేది అభినందనీయం. ఈ సిరీస్ ద్వారా వచ్చిన డబ్బు సినీ కార్మికుల ఉపాధికి వినియోగించనున్నారు. ఆ ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే. అయితే.. చూసే ప్రేక్షకుడు డబ్బు పెట్టే చూస్తున్నాడు కాబట్టి.. వాళ్ళ కోసం కూడా కాస్త ఆలోచించి ఉంటే బాగుండేది. కనీసం 30 నిమిషాల నిడివి ఉన్న 9 ఎపిసోడ్స్ లో కార్తీక్ నరేన్ తెరకెక్కిన “అద్భుత రసం” తప్ప మిగతావన్నీ సోసోగానే సాగిపోయాయి. ఒక మంచి దృక్పధంతో తెరకెక్కించిన ఈ సిరీస్ కి మంచి కథలు కూడా ఉండి ఉంటే ఒక సార్ధకత ఉండేది. కాకపోతే.. తమిళ చిత్రసీమకు చెందిన ఉత్తమ నటులందరినీ ఒకే సిరీస్ లో చూడడం అనేది ఆనందించాల్సిన విషయం. కేవలం అందుకోసమే ఈ సిరీస్ ను కాస్త బోర్ కొట్టినా చూసేయొచ్చు.

రేటింగ్: 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus