అందాల రాక్షసి సీడీలు చూసి బాధపడ్డాను

ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల వారిని భీభత్సంగా భయపెడుతున్న ఇష్యూ “పైరసీ”. సినిమా విడుదలైన రోజు లేదా మరుసటి రోజు ఆల్మోస్ట్ హెచ్.డి క్వాలిటీ ప్రింట్స్ పైరేటెడ్ సైట్లలో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఆ కారణంగా సినిమా కలెక్షన్స్ మొదటివారంలోనే దారుణంగా పడిపోతున్నాయి. ఈ విషయమై ఇప్పటికి వందలసార్లు పరిశ్రమ పెద్దలందరూ కూర్చుని మరీ మీటింగులు పెట్టి కోర్ట్ ను ఆశ్రయించినా పెద్దగా ఫలితం లేకపోయింది. అయితే.. అసలు పైరసీ వల్ల ఒక సినిమా ఎంత నష్టపోతోంది? దాని కారణంగా ఎందరి జీవితాలు రోడ్డున పడతాయి? అనే విషయాలు ఎవరికీ పెద్దగా తెలియదు. అందుకే పైరసీ నేపధ్యంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. నవీన్ చంద్ర, గాయత్రి సురేష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర పైరసీ సీడీలు అమ్ముకొనే యువకుడిగా కనిపించనున్నాడు.

ఈ పాత్ర ఒప్పుకొనేప్పుడు నవీన్ చంద్రకి తన జీవితంలో జరిగిన ఓ చేదు అనుభవం గుర్తుకొచ్చిందట. తన మొదటి సినిమా “అందాల రాక్షసి” విడుదలయ్యాక తన ఊరికి వెళ్ళిన నవీన్ చంద్రకు అక్కడ తన సినిమా పైరసీ సీడీలు కనిపించడంతో చాలా బాధపడ్డాడట. కొన్ని వందల మంది కష్టపడితే వచ్చే అవుట్ అయిన సినిమాను ఇలా రెండు మూడు రోజుల్లో పైరసీ రూపంలో అమ్మడం చాలా దారుణమని అప్పట్లో అనిపించిందట. ఇప్పుడు ఈ సినిమాలో పైరసీ సీడీలు అమ్మేవాడిగా నటించడం కొత్త అనుభవమని చెబుతున్నాడు నవీన్ చంద్ర. సాయికార్తీక్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus