టాలీవుడ్ డ్రగ్స్ కేసు… ఇదేదో సీక్వెల్ సినిమాలాగా నడుస్తూనే ఉంది. చాలా రోజుల క్రితం బయటికొచ్చిన ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ… వస్తున్న ఈ కేసు బుధవారం కీలక మలుపు తిరిగింది. హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పేర్లను పేర్కొంటూ తెలంగాణ హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో మరోసారి పరిస్థితి చర్చనీయాంశమైంది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతోందని ఈడీ ఈ సందర్భంగా పేర్కొంది. కోర్టు ధిక్కరణకు పాల్పడి మరీ ఎందుకు.. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సాక్ష్యాల్ని దాచి పెడుతున్నారన్నది తెలియడం లేదంటూ టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే విషంయలో గతంలో ఈడీ దర్యాప్తు చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. దాంతో ఈడీ ఏమీ చేయలేకపోయింది. ఈడీ కేసు విచారణ జరుగుతున్నప్పుడు సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసులో ఆధారాల్లేవని ఎక్సైజ్ శాఖ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.
కోర్టు చెప్పినా ఇప్పుడు డిజిటల్ వివరాలు ఇవ్వడం లేదు. ఈ పరిణామాలన్నీ చూస్తూంటే తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయంలో వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఇదంతా ఎవరినో కాపాడే ప్రయత్నం అని అంటున్నారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అదే పనిగా డ్రగ్స్ కేసును ఫాలో అప్ చేస్తున్నారు. ఈడీకి పూర్తి వివరాలు ఇవ్వాలనే ఆదేశాలు తెలంగాణ పోలీసులకు కోర్టు నుంచి వెళ్లాయి. కానీ పోలీసులు ఇవ్వలేదు.
ఎన్ని సార్లు అడిగినా ఇవ్వకపోవడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్… కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ కోరిన వివరాలు ఇవ్వాలని ఫిబ్రవరి 2న ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది. కానీ ఇవ్వలేదు.