‘దేవర’ సినిమా వసూళ్ల విషయంలో ఎంత కన్‌ఫ్యూజన్ ఉందో.. ఆ సినిమాకు సీక్వెల్ విషయంలో అంతే కన్‌ఫ్యూజన్ ఉంది. తొలి కన్‌ఫ్యూజన్‌కి కారణం ఆ సినిమాను రిలీజ్ చేసిన నిర్మాత నాగవంశీ కాగా.. ఇప్పుడు రెండో కన్‌ఫ్యూజన్‌కి కారణం ఆ సినిమాను నిర్మించిన నిర్మాత. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న చర్చకు దాదాపు ఫుల్ స్టాప్ పెట్టేలా ఓ పోస్ట్ ‘దేవర’ సినిమా నిర్మాణ సంస్థ నుండి బయటకు వచ్చింది.
ఆ అప్‌డేట్ తారక్ అభిమానులకు పుట్టిన రోజు నాడు చేదు వార్త ఇచ్చినట్లు అయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ‘దేవర’ సునామీని మరోసారి చూద్దామని ఆశపడుతున్న ఫ్యాన్స్‌కి షాకిచ్చేలా ‘దేవర 2’ అప్‌డేట్ లేకుండా తారక్ పుట్టిన రోజును ముగించేశారు ‘దేవర’ సినిమా నిర్మాణ సంస్థ యువ సుధ ఆర్ట్స్. ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఏదైనా పోస్టర్, వీడియో లాంటిది రిలీజ్ చేసి ‘దేవర 2’ అప్‌డేట్ ఇస్తారేమో అని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే మా ‘దేవర’కు జన్మదిన శుభాకాంక్షలు అని ఓ పోస్టర్ వేసి వదిలేశారు.
అందులో ఎక్కడా ‘దేవర 2’ అనే పేరు, సినిమా ప్రస్తావన కనిపించలేదు. దీంతో ఇక ‘దేవర 2’ మీద ఆశలు పెట్టుకోవడం సరికాదు అని ఫ్యాన్స్ ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. నిజానికి ఇప్పటికప్పుడు ‘దేవర 2’ సినిమా చేసే పరిస్థితిలో తారక్ లేడు. ప్రస్తుతం చేస్తున్న ‘డ్రాగన్’ సినిమా రెండు పార్టులు అని అంటున్నారు. వాళ్లు చెప్పిన తేదీల ప్రకారం చూసిన వచ్చే ఏడాది జులై వరకు ఎన్టీఆర్ డేట్స్ ఖాళీగా లేవు. ఆ తర్వాత కనీసం మూడు నెలల గ్యాప్ తీసుకోవడం పక్కా అని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ‘దేవర’ దర్శకుడు కొరటాల శివ కొత్త ప్రాజెక్ట్ భుజానికెత్తుకున్నారు అని చెప్పొచ్చు. బాలకృష్ణతో అదే యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ మీదనే ఇటీవల సినిమాను అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాల తర్వాత తారక్ – కొరటాల మళ్లీ కలవొచ్చు. కానీ ఇదంతా జరిగి సినిమా రావాలంటే 2028లోనే. చూద్దాం ఎంత ఛాన్స్ ఉందో?