ఎన్టీఆర్ మహానాయకుడు

జనం మెచ్చిన మనిషి, జనం నమ్మిన నాయకుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన “ఎన్టీఆర్ బయోపిక్”లో రెండో భాగం “ఎన్టీఆర్ మహానాయకుడు”. మొదటి భాగం “ఎన్టీఆర్ కథానాయకుడు” జనవరిలో విడుదలై అద్భుతమైన స్పందన అందుకున్నప్పటికీ.. కమర్షియల్ గా మాత్రం ఫెయిల్ అయ్యింది. ఆ కమర్షియల్ ఫెయిల్యూర్ ను కవర్ చేయడానికి విడుదలైన “ఎన్టీయార్ మహానాయకుడు” ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో చూడాలి.

కథ: ఫస్ట్ పార్ట్ మొత్తం రామారావు సినిమా జీవితాన్ని, పౌరుల పట్ల ఆయనకున్న అభిమానాన్ని చూపించిన క్రిష్.. ఎన్టీఆర్ అనే వ్యక్తి “తెలుగుదేశం” పార్టీని స్థాపించి 1984 ఎన్నికల్లో ఏకగ్రీవంగా, భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత కూడా తన సొంత మనిషి అనుకున్న నాదెండ్ల భాస్కర్రావు కారణంగా రాజ్ భవన్ సాక్షిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొన్ని నెలలకే రిజైన్ చేయాల్సిన పరిస్థితి రావడం, ఆ పరిస్థితులను చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటటేశ్వర్రావుల సహాయంతో నెట్టుకురావడం, అసెంబ్లీలో తన బలాన్ని (168 మంది ఎమ్మేల్యేలు తన మద్ధతుగా ఉన్నారని నిరూపించుకొని) చాటుకొని మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి.. తన భార్య బసవతారంను కడసారి చూసేందుకు వెళ్లడంతో సినిమా ముగుస్తుంది.

నటీనటుల పనితీరు: ఫస్ట్ పార్ట్ లో యంగ్ ఎన్టీఆర్ గా కనిపించడానికి కాస్త ఇబ్బందిపడి, పెట్టిన బాలయ్య.. సెకండ్ పార్ట్ కి వచ్చేసరికి ముదుసలి రామారావుగా పర్ఫెక్ట్ గా సరిపోయాడు. ఆయన వాచకాన్ని రీక్రియేట్ చేయలేకపోయినా.. ఆయన బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్స్ ను మాత్రం రీప్రెజంట్ చేయగలిగాడు. ముఖ్యంగా.. విద్యాబాలన్ తో ఎమోషనల్ ఎపిసోడ్స్ లో మాత్రం కన్నీరు పెట్టించేశాడు బాలయ్య. అలాగే.. అసెంబ్లీలో ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నా సరే ధైర్యంగా వాటిని ఎదుర్కొన్న మహానాయకుడిగానూ బాలయ్య నటన సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు.

బసవతారకం పాత్రకు విద్యాబాలన్ ప్రాణం పోసింది. నిజంగా ఆవిడ అలాగే ఉండేదేమో అని అందరూ అనుకొనేలా ఆమె పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది విద్యాబాలన్. ఆఖరి శ్వాస వరకూ భర్త విజయం కోసం పరితపించిన ఇల్లాలిగా ఆమె నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రాణా జీవించేశాడు. చంద్రబాబు వాచకం, వ్యవహారశైలి అన్నీ అచ్చుగుద్దినట్లు దింపేశాడు. అప్పట్లో చంద్రబాబును చూసినవాళ్లెవరైనా ఈ సినిమా చూస్తే.. రాణాను మెచ్చుకోకుండా మాత్రం ఉండలేరు. అంత అద్భుతంగా నటించాడు రాణా.

ఇక కథలో అసలు విలన్ అయిన నాదెండ్ల భాస్కర్ రావు పాత్రకు సచిన్ కేల్కర్ ఎంతగా సరిపోయాడు అంటే.. పొరపాటున ఆయన్ను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమానులు బయట చూస్తే కొడతారేమో అనిపించేంతలా. సుమంత్ సెకండ్ పార్ట్ లోనూ ఏయన్నార్ గా ఒక సన్నివేశంలో మెరిసాడు. నారా భువనేశ్వరిగా మంజీమా మోహన్, పురంధరేశ్వరిగా హిమాన్సీ చౌదరీ.. ఇలా అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: ఫస్ట్ పార్ట్ కి ఒన్నాఫ్ ది హైలైట్ గా నిలిచిన కీరవాణి సెకండ్ పార్ట్ కి మాత్రం న్యాయం చేయలేకపోయాడు. పాటలు బాగున్నప్పటికీ.. నేపధ్య సంగీతం మాత్రం సినిమాకి మైనస్ అనే చెప్పాలి. ఏ ఒక్క సన్నివేశంలోనూ ఎలివేట్ అవ్వాల్సిన ఎమోషన్ కానీ.. పాత్ర కానీ ఎలివేట్ అవ్వలేదు.

సినిమాటోగ్రాఫర్ జ్ణాణశేఖర్ వి.ఎస్ వర్క్ సెకండ్ పార్ట్ లోనూ అదే క్వాలిటీతో కంటిన్యూ అయ్యింది. అర్రం రామకృష్ణ ఎడిటింగ్ వర్క్ బాగుంది. చాలా తక్కువ స్పాన్ లో జరిగే కథని చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేశాడు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.

దర్శకుడు క్రిష్.. ఫస్ట్ పార్ట్ మొత్తం ఎన్టీఆర్ క్లాసిక్స్ ను రీక్రీట్ చేయడం మీద కాన్సన్ ట్రేట్ చేయడం “ఎన్టీఆర్ కథానాయకుడు” చిత్రానికి మైనస్ గా నిలిస్తే.. సెకండ్ పార్ట్ లో చరిత్రలోని కొన్ని కీలక ఘట్టాలను మార్చి చూపించడం, చంద్రబాబునాయుడ్ని హీరోను చేయడం మైనస్ గా మారింది. ఎన్టీఆర్ జీవితంలో ఆయన సతీమణి బసవతారకం ఎంత కీలకమైనా కూడా ఆయన పోలిటికల్ లైఫ్ లో నాదెండ్ల పన్నిన పన్నాగానికి మించిన ఎత్తుపల్లాలున్నాయి. ఆయన పర్సనల్ లైఫ్ లోనూ బసవతారకం మరణం అనంతరం చాలా జరిగాయి. వాటిపై మాత్రం క్రిష్ కాన్సన్ ట్రేట్ చేయలేదు. బసవతారకం మరణంతో ఎన్టీఆర్ బయోపిక్ ను ఎండ్ చేయడం అనేది సినిమాకి మైనస్ అనే చెప్పాలి.

1989 ఎలక్షన్స్ లో ఓడిపోవడం, మళ్ళీ 1994 ఎలక్షన్స్ లో గద్దెనెక్కడం, నేషనల్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఇలా ఎన్టీఆర్ లైఫ్ లో చాలా విషయాలను ఎన్టీఆర్ మహానాయకుడు బయోపిక్ లో కవర్ చేయలేదు. దాంతో తెలుగుదేశం పార్టీ వర్గాలు సినిమాను ఆదరించవచ్చేమో కానీ.. సాధారణ ప్రేక్షకులు మాత్రం సినిమాలోని ఎమోషన్స్ ను అర్ధం చేసుకోలేక, కొన్నిటికి కనెక్ట్ అవ్వలేక కాస్త ఇబ్బందిపడడం ఖాయం. ఒకరకంగా చూసుకుంటే.. ఎన్టీఆర్ కథానాయకుడులో ఉన్న ఎలివేషన్స్ కానీ, ఎమోషన్స్ కానీ ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో లేవు. ఆ కారణంగా ఫస్ట్ పార్ట్ తో కంపేర్ చేసినప్పుడు సెకండ్ పార్ట్ ఒక మెట్టు కిందే ఉండిపోయింది. ముఖంగా సెకండ్ హాఫ్ ను సాగదీసిన విధానం.. రెండు గంటల సినిమా కూడా లెంగ్తీగా అనిపించింది.

విశ్లేషణ: సినిమాలో రాణా ఒక డైలాగ్ చెబుతాడు “ఎన్టీఆర్ అంటేనే ఎమోషన్” అని. నిజమే దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ స్థాయి ఘనమైన రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు లేడు. ఆయన గెలవడంలో కానీ.. ఆయన ఎదుగుదలలో కానీ కీలకపాత్ర పోషించింది ఆయనలోని ఎమోషనే. “ఎన్టీఆర్ మహానాయకుడు” చిత్రంలో ఆ ఎమోషన్ మిస్ అయ్యింది. సో, “ఎన్టీఆర్ మహానాయకుడు” అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. కానీ.. చరిత్రను పట్టించుకోకుండా.. ఒక భార్యాభర్తల ఎమోషనల్ జర్నీగా సినిమా చూడగలిగితే మాత్రం “ఎన్టీఆర్ మహానాయకుడు” ఆకట్టుకొనే అవకాశం ఉంది.

రేటింగ్: 2/5

CLICK HERE TO READ ENGLISH REVIEW

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus