స్వీటీ అనుష్క తొలి సారి ద్వి పాత్రాభినయం చేసిన సినిమా “అరుంధతి”. ఇందులో అరుంధతి, జేజెమ్మ గా అలరించింది. ఆ తర్వాత “పంచాక్షరి” లో ‘పంచాక్షరి’, గా హనీ గా ఆకట్టుకుంది. వర్ణ సినిమాలో అయితే మూడు పాత్రల్లో మెరిసింది. బాహుబలి చిత్రాల తర్వాత అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా “భాగమతి”. ఇందులోనూ స్వీటీ ద్విపాత్రాభినయం చేసినట్లు తెలిసింది. జి.అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ అనుష్క అభిమానులకు పండుగలా ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇప్పుడు మరోసారి డ్యూయల్ రోల్ పోషించనున్నట్లు టాక్. విక్టరీ వెంకటేశ్, తేజ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతోంది.
ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ లో హీరోయిన్ గా అనుష్కను ఎంపిక చేసినట్లు ఫిలిం నగర్ వాసులు తెలిపారు. అలాగే అనుష్క ఇందులో రెండు పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. ఇదివరకు అనుష్క, వెంకటేష్ చింతకాయల రవి చిత్రంలో కలిసి నటించారు. ఇప్పుడు మళ్ళీ నటించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.