“సమస్యను ఎదుర్కోడంలో నాకు భయం లేదు.. ఎంత పెద్ద నాయకులనైనా ప్రశ్నించడానికి నేను సిద్ధం” అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. కాకినాడలో జనసేన ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సీమాంధ్ర ఆత్మగౌరవ బహిరంగ సభ లో అయన మాట్లాడారు. మనవైపు సత్యం ఉంది, అందుకే ఎవరికీ బయపడనవసరం లేదని, ఎప్పటికైనా సత్యం మాత్రమే గెలుస్తుందని ధైర్యం నూరి పోశారు. మనకీ రౌడీలు అక్కర లేదు, మనమే ఒక సైన్యం.. జన సైన్యం అని తెలిపారు.
భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి కాకినాడకు తాను రాలేదని, తెలుగు దేశం, బీజీపీ నాయకులకు మన బాధ తెలియజేయడానికి వచ్చానని వివరించారు. స్పెషల్ స్టేటస్ కి కట్టుబడి ఉండమని నేతలను కోరడానికి వచ్చానని చెప్పారు. “కేంద్రం ఇచ్చే పాచి పోయిన లడ్డూలు లాంటి ప్యాకేజీలు వద్దని, ప్రత్యేక హోదాపై కావాలని అడగాలని ఇక్కడి నాయకులకు చెబుతున్నాను, పోరాటం మీ వల్ల కాక పోతే, జన సేన సైన్యం రంగంలో దిగుతుంది” అని హెచ్చరించారు. ఆత్మగౌరవం ఉన్న ఏ తెలుగోడు కేంద్రానికి జీ హుజూర్ అనడని గొంతెత్తి నినదించారు.