పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాలు తీయాలని నిర్మాతలు క్యూలో ఉన్నారు. ప్రముఖ దర్శకులు అతన్ని డైరక్ట్ చేయాలనీ కలలు కంటున్నారు. సినిమాల్లో ఇంత క్రేజ్ ఉన్న పవన్ .. నటనను వదిలి ప్రజల్లోకి వచ్చారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ఎండల్లో తిరుగుతున్నారు. గత మూడు రోజులుగా కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాల్లో పర్యటించిన జనసేనాని నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తమ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ 2018 సంవత్సరానికి పద్మ అవార్డులు అందుకున్న వారికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “మున్ముందు పద్మ పురస్కారాల్లో అలనాటి నటులు సావిత్రి, ఎస్వీఆర్‌కి పద్మ అవార్డులు ఇవ్వాలని ప్రతిపాదిస్తే బాగుంటుంది, ఆ దిశగా ఆలోచించాలని కోరుకుంటున్నాను” అని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు విన్నవించారు. ‘చలోరే.. చలోరే’ కార్యక్రమంలో భాగంగా పవన్ కల్యాణ్ ఈరోజు అనంతపురం జిల్లాలో పర్యటించారు. అనంతపురంలోని గుత్తి రహదారిలో జనసేన పార్టీ కార్యాలయానికి ఆయన భూమిపూజ చేశారు. రాయలసీమ పట్ల తనకు ఉన్న ప్రేమను తెలియజేసేందుకు అనంతపురంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలు తనపై చూపుతున్న ప్రేమను జీవితంలో మరచిపోలేనని అన్నారు.