చిరంజీవి – బాబీ సినిమాకు అడ్డంకులన్నీ తొలగిపోయాయా? చిత్ర నిర్మాణ సంస్థ సినిమాకు కొబ్బరికాయ కొట్టడానికి రెడీ అయిందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. దీనికి సంబంధించిన పిలుపులు కూడా జరిగిపోయాయి అని చెబుతున్నారు. సినిమాకు పిలుపు ఏంటి అనుకుంటున్నారా? మా ఉద్దేశం సినిమా ముహూర్తానికి పిలుపులు అని. అవును చిరంజీవి – బాబీ కలయికలో రెండో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారట. ఈ నెల 11ను దీనికి ముహూర్తంగా ఫిక్స్ చేశారట.
గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన కేవీఎన్ ప్రొడక్షన్స్ పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటమే. ఆ బ్యానర్‌లో రూపొందిన మూడు సినిమాలు విడుదలకు ఇబ్బందిపడుతున్నాయి. విజయ్ ‘జన నాయగన్’ సెన్సార్ చిక్కుల్లో ఉండగా, యశ్ ‘టాక్సిక్’ వాయిదా పడింది. ఇక ధ్రువ్ సర్జా ‘కేడీ’ కూడా పాట చిక్కుల్లో ఉంది. దీంతో గతంలో అనౌన్స్ చేసిన చిరంజీవి – బాబీ సినిమా ఉండదు అని వార్తలొచ్చాయి. బాబీ కొత్త నిర్మాత కోసం చూస్తున్నారనే పుకార్లు షికార్లు చేశాయి.
అయితే అవన్నీ పుకార్లు మాత్రమేనని, సినిమా ప్రారంభిస్తారని వార్తలొచ్చాయి. ఇప్పుడు అవే నిజమవుతున్నాయి. ఎందుకంటే చిరంజీవి సినిమా ముహూర్తపు షాట్‌కి గెస్ట్‌లను పిలిచారట. అందులో భాగంగానే ఇటీవల చిరంజీవి సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను దర్శకుడు బాబీ, నిర్మాత లోహిత్ కలిశారు. దానికి సంబంధించిన ఫొటోలు కూడా బాబీ షేర్ చేశారు. అయితే అందులో సినిమా ముహూర్తం పిలుపు అని రాయలేదు. ఏదో పని మీద కలిశాం అన్నట్లుగా రాశారు.
అయితే, బాబీ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఏప్రిల్ 8, 2016న విడుదలైంది. ఆ నేపథ్యంలో కలిశారు అనుకున్నా.. ఆ సినిమా ఫలితం దృష్ట్యా కలయికకు కారణం అది కాదు. ఈ లెక్కన 11న మెగా అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.