తెలుగు ఇండస్ట్రీలో చిన్నసైజు సునామీ సృష్టించిన చిత్రం “పెళ్ళిచూపులు”. ప్రధాన పాత్రధారులందరూ తెలంగాణ యాసలో మాట్లాడే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులందర్నీ విశేషంగా ఆకట్టుకొని సూపర్ హిట్ కొట్టడంతోపాటు నేషనల్ అవార్డ్ కూడా సాధించింది. ఆ చిత్రాన్ని హిందీలో “మిత్రోన్” పేరుతో రీమేక్ చేయగా.. నిన్న విడుదలైందా చిత్రం. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది కాబట్టి హిందీలో కనీసం యావరేజ్ గా అయినా నిలుస్తుంది అని భావించారు హిందీలో ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకనిర్మాతలు. కానీ.. తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చిన “పెళ్ళిచూపులు” చిత్రం హిందీ ఆడియన్స్ ను మాత్రం మెప్పించలేకపోయింది.
దాంతో ఈ చిత్రానికి మిమిమమ్ ఓపెనింగ్స్ కూడా రాకపోగా సెకండ్ డే కూడా మినిమం కలెక్షన్స్ లేవు. దాంతో “పెళ్ళిచూపులు” బాలీవుడ్ రీమేక్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇలా తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రాలు పరాయి భాషలో ఫ్లాప్ అవ్వడం మొదటిసారికాకపోయినా.. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే కంటెంట్ అయిన పెళ్ళిచూపులు లాంటి చిత్రం కూడా బాలీవుడ్ లో వర్కవుట్ అవ్వకపోవడం పట్ల దర్శకనిర్మాతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. రాంగ్ క్యాస్టింగ్ వల్ల సినిమా పోయింది కానీ ఎవరైనా పెద్ద హీరో చేసి ఉంటే మాత్రం తప్పకుండా మంచి విజయం సాధించి ఉండేదని చెబుతున్నారు విశ్లేషకులు.