నాకైతే ఆ క్యారెక్టర్స్ ఎప్పుడూ బోర్ కొట్టలేదు : పూజాకుమార్

  • July 8, 2020 / 12:03 PM IST

“విశ్వరూపం” సినిమాలో కమల్ హాసన్ భార్యగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి పూజాకుమార్. ఈ నార్త్ ఇండియన్ బ్యూటీ హాలీవుడ్ యాక్ట్రెస్ కావడమే కాదు.. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన “నెట్ ఫ్లిక్స్” సంస్థ రూపొందించనున్న ఓ వెబ్ సిరీస్ లోనూ ముఖ్యపాత్ర పోషించనుంది. ఆమె నటించిన స్ట్రయిట్ తెలుగు చిత్రం “గరుడ వేగ”. రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 3న విడుదలకానుంది. ఈ సందర్భంగా రాజశేఖర్ తో కలిసి వర్క్ చేయడం, ప్రవీణ్ సత్తారు దర్శకత్వ శైలి గురించి, వరుసబెట్టి గృహిణి పాత్రలు పోషిస్తుండడం గురించి పూజాకుమార్ బోలెడు విశేషాలు చెప్పింది..!!

120 పేజీల స్క్రిప్ట్ ఇచ్చాడు..
“విశ్వరూపం” తర్వాత తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి, కొందరు స్క్రిప్ట్ వినిపించారు. కానీ.. ప్రవీణ్ సత్తారు నన్ను కలిసి స్టోరీ లైన్ చెప్పిన తర్వాత 120 పేజీల స్క్రిప్ట్ ఇచ్చాడు. ఒక్కో పేజీ చదువుతుంటే.. అతడు కథ రాసుకొన్న తీరు, స్క్రీన్ ప్లే కోసం తీసుకొన్న జాగ్రత్తలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. వెంటనే ఫోన్ చేసి “ఐయామ్ రెడీ” అని చెప్పేశాను.

అప్పటికి రాజశేఖర్ ఎవరో తెలీదు..
స్క్రిప్ట్ ఒకే చేసే సమయానికి నాకు రాజశేఖర్ గురించి తెలియదు. తర్వాత ఆయన నటించిన కొన్ని తెలుగు సినిమాలు చూశాను. మాగ్జిమమ్ పోలీస్ క్యారెక్టర్స్ ప్లే చేశాడాయన. పోలీస్ పాత్రలో ఆయన నటన చూసి షాక్ అయ్యాను, ఆయనకి ఆ పోలీస్ క్యారెక్టర్స్ అన్నీ టైలర్ మేడ్ లా ఉన్నాయి. “గరుడ వేగ”లో కూడా అదే స్థాయిలో ఉంటుంది ఆయన రోల్.

టిపికల్ హౌస్ వైఫ్ రోల్ మాత్రం కాదు..
ఈ సినిమాలో నేను పోషిస్తున్నది హౌస్ వైఫ్ క్యారెక్టరే అయినప్పటికీ.. రెగ్యులర్ హౌస్ వైఫ్ రోల్ కి చాలా భిన్నంగా ఉంటుంది. భర్త చేసే ఉద్యోగాన్ని అర్ధం చేసుకుంటూనే అతడి ప్రేమ కోసం పరితపించే ఇల్లాలిగా కనిపిస్తాను. దేశ రక్షణ కోసం భర్త శ్రమిస్తుంటే.. అతడి క్షేమం కోసం భార్య ఆరాటం చాలా హృద్యంగా ఉంటుంది.

వాళ్ళ ఫ్యామిలీస్ కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామా..
నేను ఈ సినిమాలో “ఎన్.ఐ.ఏ” ఆఫీసర్ భార్య పాత్ర పోషిస్తున్నప్పుడు నాకో ఆలోచన వచ్చింది. నిజజీవితంలో ఆర్మీ వాళ్ళు చాలా కష్టపడి బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు సరే.. కానీ వాళ్లతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా అదే స్థాయిలో తమ బిడ్డ/భర్త/అన్న/తమ్ముడు ఇంటికి వస్తాడో, రాడో, వస్తే ప్రాణాలతో తిరిగొస్టాడా? లేదా? అని అనునిత్యం టెన్షన్ పడుతుంటారు. అలాంటి కుటుంబ సభ్యులకు మనం సరైన అటెన్షన్ ఇవ్వడం లేదు.

ఆ యాక్షన్ సీన్స్ లో నేనూ ఉన్నాను..
సాధారణంగా హీరోయిన్ రోల్స్ అంటే నాలుగు పాటలు, ఆరు సీన్లు అన్నట్లుగా ఉంటాయి. అయితే.. “గరుడవేగ”లో మాత్రం నా క్యారెక్టర్ కి స్కోప్ ఎక్కువ. జార్జియాలో తీసిన యాక్షన్ సీన్స్ లో కూడా నేనున్నాను. అయితే.. నేనేం ఫైట్లు చేయలేదనుకోండి (నవ్వుతూ).

ఒక హాలీవుడ్ సినిమా, ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్..
ప్రస్తుతం “విశ్వరూపం 2” ప్యాచ్ వర్క్ జరుగుతోంది. అలాగే.. హాలీవుడ్ లో డ్వైన్ జాన్సన్ (రాక్)తో ఒక సినిమా చేస్తున్నాను, అది నెక్స్ట్ ఇయర్ రిలీజవుతుంది. ఆ సినిమా తర్వాత ఒక “నెట్ ఫ్లిక్స్” సిరీస్ లోనూ నటించేందుకు సన్నద్ధమవుతున్నాను. అలాగే తెలుగులోనూ ఆఫర్లు వస్తున్నాయి.. నాకు నచ్చిన కథలు ఎంపిక చేసుకొని హీరోయిన్ గా కొనసాగుతా.

నాకైతే బోర్ కొట్టలేదు..
నిజమే.. “విశ్వరూపం, విశ్వరూపం 2, ఉత్తమ విలన్” చిత్రాల్లో వరుసబెట్టి హౌస్ వైఫ్ రోల్స్ ప్లే చేశాను. ఇప్పుడు “గరుడ వేగ” చిత్రంలోనూ హౌస్ వైఫ్ గా కనిపించనున్నాను. నాకైతే ఇలా వరుసబెట్టి హౌస్ వైఫ్ రోల్స్ ప్లే చేయడం బోర్ కొట్టలేదు. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ పండించినన్ని ఎమోషన్స్ మరే ఇతర పాత్రా పండించలేదు. ఒకవేళ నెక్స్ట్ సినిమాలో కూడా హౌస్ వైఫ్ రోల్ ప్లే చేయాల్సి వస్తే నేనేమాత్రం వెనక్కి వెళ్లను.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus