బాలీవుడ్ నటి పూనమ్ పాండేను ఆమె భర్త దారుణంగా కొట్టడంతో హాస్పిటల్ లో చేరింది. పూనమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పూనమ్ భర్త సామ్ బాంబే తన మొదటి భార్య అల్విరాతో మాట్లాడుతుండడం పూనమ్ కి నచ్చలేదు. దీంతో అతడిని ప్రశ్నించింది. ఈ విషయంలో కోపంతో ఊగిపోయిన సామ్ బాంబే.. పూనమ్ జుట్టుపట్టుకుని తలను గోడకేసి కొట్టాడు. ఇష్టమొచ్చినట్లు ఆమెపై దాడి చేయడంతో.. పూనమ్ తల, కళ్లు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.
పూనమ్ ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తీవ్ర గాయాలపాలైన పూనమ్ ప్రస్తుతం హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతుంది. రెండేళ్లపాటు సహజీవనం చేసిన పూనమ్-సామ్ బాంబే గతేడాది సెప్టెంబర్ 1న వివాహబంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లైన కొద్దిరోజులకే సామ్.. పూనమ్ పై చేయి చేసుకోవడంతో ఆమె కేసు పెట్టింది. ఆ సమయంలో భర్త క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా మరోసారి సామ్ బాంబే చేసిన దాడిలో పూనమ్ తీవ్ర గాయాలపాలైంది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడింది. తనపై ఇలా దాడి చేయడం మొదటిసారి కాదని.. ప్రతిసారీ కొడుతూ.. ఆ తర్వాత ఏడుస్తూ క్షమాపణలు చెప్పడంతో కరిగిపోయేదాన్ని అని చెప్పుకొచ్చింది. కానీ ఈసారి దారుణంగా హింసించాడని కన్నీళ్లు పెట్టుకుంది.