టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోల్లో రవితేజ ఒకరు. అభిమానులంతా ఆయన్ను మాస్ మహారాజా అని పిలుచుకుంటారు. రీసెంట్ గా ‘ధమాకా’ సినిమాతో వంద కోట్ల క్లబ్ లోకి చేరారు రవితేజ. ఆ తరువాత చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఓ పక్క మాస్ సినిమాల్లో నటిస్తూనే.. మరోపక్క రొటీన్ కి భిన్నంగా, కొత్తగా అనిపించే సినిమాలు చేస్తుంటారు.
కానీ అవి రవితేజకి పెద్దగా కలిసి రాలేదు. ‘ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’తో మొదలుకొని ‘రామారావు ఆన్ డ్యూటీ’ వరకు తన ఇమేజ్ పక్కన పెట్టి రవితేజ చేసిన సినిమాలు ఆయనకు చేదు అనుభవాలను మిగిల్చాయి. ఇలా ఎదురుదెబ్బ తగిలిన ప్రతీసారీ మళ్లీ మాస్ సినిమాలు చేసుకుంటూ సేఫ్ జోనర్ లో ఉంటూ ఉంటారు. కానీ కొన్నాళ్లకు ఒక డిఫరెంట్ సినిమా చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మరోసారి అలాంటి ఆలోచనే చేస్తున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరుగా మారిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మతో రవితేజ ఓ సినిమా చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ‘అ!’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు ప్రశాంత్ వర్మ. ఆ తరువాత ‘జాంబీరెడ్డి’ అనే సినిమా తీశారు. ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేస్తోన్న ‘హనుమాన్’ సినిమాపై మంచి హైప్ వచ్చింది. దీని తరువాత బాలయ్యతో ఓ సినిమా చేయబోతున్నారు ప్రశాంత్ వర్మ.
కానీ అది ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదు. ఈలోగా రవితేజకు ఒక కథ చెప్పి మెప్పించినట్లు సమాచారం. ప్రశాంత్ వర్మ సినిమా అంటే కాస్త కొత్తగా ఉంటుంది. అయితే రవితేజ తన సేఫ్ జోనర్ వదిలి ప్రయోగాలు చేసిన చాలా సార్లు దెబ్బ తిన్నారు. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి!