సెలబ్రిటీ పెళ్లి అయ్యేంతవరకు ఫ్యాన్స్, నెటిజన్లు ఎక్కువగా మాట్లాడే అంశం.. పెళ్లెప్పుడు అని. ఈ మాట సెలబ్రిటీలకు కూడా తొలి రోజుల్లో ఆనందంగా అనిపించినా.. ఆ తర్వాత ‘ఏంటీ నస’ అని అనిపిస్తుంది. వన్స్ పెళ్లి అయిపోయిన తర్వాత.. అందులోనూ పెళ్లి చేసుకున్నది సినిమా రంగానికి సంబంధించిన వారినే అయితే.. అప్పుడు మొదలైపోతుంది.. వాళ్ల రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి. ఇద్దరూ కలసి ఫొటో దిగినా, కలసి ఫొటో దిగకపోయినా ఏదో మాట అంటూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్ని చాలామంది సెలబ్రిటీలు ఎదుర్కొంటారు.
రీసెంట్ టైమ్స్‌లో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న హీరోయిన్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. బాలీవుడ్ హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత ఇంటర్నేషనల్ హీరోయిన్‌గా మారిపోయింది ప్రియాంక చోప్రా. ఈ క్రమంలో మ్యూజిక్ సెన్సేషన్, యాక్టర్ నిక్ జొనాస్‌ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరి వివాహం జరిగి ఎనిమిదేళ్లు అవుతోంది. అయితే ఇప్పటికీ వారి వివాహ బంధం గురించి ఏవేవో పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ పుకార్లు వినిపిస్తూ ఉన్నాయి.
ఈ మాటలు ఆమె చెవిన కూడా పడ్డాయి. మా పెళ్లి బంధం ముగిసిపోవాలని కోరుకుంటున్నారా? అసలు ఎందుకు మా రిలేషన్ గురించి ఇలాంటి రూమర్లు వస్తున్నాయో అర్థం కావడం లేదు. మా ఇద్దరి మధ్య బంధం వారికి ఇబ్బంది కలిగిస్తుందో తెలియడం లేదు. వేర్వేరు దేశాలు, వేర్వేరు మతాలు, వయసు తేడా లాంటి విషయాల గురించి ఆలోచిస్తున్నారేమో. మేమైతే ఆ విషయాలు ఎప్పుడో మరచిపోయాం. ఆలోచించడం మానేశాం. ఇప్పటికైనా అందరూ ఈ విషయాల గురించి మాట్లాడటం మానేస్తే బెటర్ అని సజెస్ట్ చేసింది ప్రియాంక చోప్రా.
ఇక ప్రియాంక సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో అతి పెద్ద సినిమాగా పేరు గాంచిన మహేష్ బాబు – రాజమౌళి – పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేస్తారు.