‘వారణాసి’ సినిమాకు సంబంధించి మీడియాలో కాస్త సందడి తగ్గడం ఆలస్యం.. ఆ సినిమా టీమ్ నుండి ఎవరో ఒకరి ఇంటర్వ్యూ బయటకు వచ్చేస్తోంది. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంటర్వ్యూ ఒకటి మీడియాలోకి, సోషల్ మీడియాలోకి వచ్చేసింది. అందులో ఆయన సినిమా గురించి, ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆకాశానికెత్తేశారు. రాజమౌళి గొప్ప దర్శకుడు మాత్రమే కాదని.. మంచి నటుడని ప్రశంసించారు.
మహేశ్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. కానీ ఇప్పుడు ప్రచార వీడియోలు, ఇంటర్వ్యూలు వస్తున్నాయి. అలా వచ్చిన ఓ వీడియలోనే పృథ్వీరాజ్ సుకుమారన్ పొగడ్తల కార్యక్రమం జరిగింది. మోహన్‌లాల్ తర్వాత దర్శకుడు రాజమౌళి కూడా అంత గొప్ప నటుడిగా కన్పించారు అని మెచ్చేసుకున్నారు.
సెట్స్‌లో ఏదైనా సీన్ వివరించేటప్పుడు ఆ పాత్రలో రాజమౌళి లీనమవుతారని, ఆ సీన్‌కు కావాల్సిన ఎమోషన్స్ అన్నీ స్వయంగా ఆయనే ముఖంలో పలికిస్తారని చెప్పారు. ఆ సన్నివేశం ఎలా చేయాలో, ఆ భావోద్వేగాలు ఎలా ఉండాలో నటులకు అర్థం కావడం కోసం ఆయన పాత్రలో జీవించి చూపిస్తారని మెచ్చేసుకున్నారు. ఒక్కోసారి రాజమౌళి చెప్పిన సన్నివేశాలు అర్థమయ్యేవి కాదని, దాన్ని అర్థం చేసుకోవడానికి శ్రమించాను. ఆయన విజన్‌కు, తన నటనకు మధ్య సెట్స్‌లో చిన్నపాటి యుద్ధమే జరిగిందని అన్నారు పృథ్వీరాజ్.
అయితే రాజమౌళిపై నమ్మకంతో ఆయన చెప్పిందే చేశానని, చేస్తానని చెప్పారు. రాజమౌళిలా కష్టపడే దర్శకుడిని ఇప్పటివరకు చూడలేదన్నారాయన. రాజమౌళి ప్రతి సినిమాను మొదటి సినిమాలా భావించి కష్టపడతారని అందరూ చెప్పే మాటే మళ్లీ చెప్పారు. ఒక్కోసారి సీన్ ఉదయం 5 గంటలకు మొదలు పెడితే రాత్రి వరకూ జరుగుతుందని, ఆయన అనుకున్నట్లు రాకపోతే.. మరుసటి రోజు కూడా అదే సీన్ చేస్తారని చెప్పుకొచ్చారు. ఇలా చేస్తారనే రాజమౌళిని తారక్ జక్కన్న అని పిలుస్తారు మరి.