ఎట్టకేలకు ఓ బ్లాక్ బస్టర్ అందుకుని మళ్ళీ అందరి దృష్టి తన వైపు తిప్పుకున్నాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ‘టెంపర్’ సినిమా తరువాత పూరి డైరెక్ట్ చేసిన సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి. ప్రేక్షకులు కూడా పూరి సినిమా అంటే పక్కన పెట్టేయడం అలవాటు చేసుకున్నారు. ఇలాంటి టైములో బ్లాక్ బస్టర్ కొట్టడం ఆషా మాషీ విషయం కాదు. ఇదిలా ఉంటే.. పూరి డ్రీం ప్రాజెక్ట్ అయిన ‘జనగణమన’ మొదట మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు. కానీ ఎందుకో కుదర్లేదు. ఇప్పటి వరకూ ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేసాడు పూరి. ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్టవ్వడంతో మళ్ళీ ‘జనగణమన’ స్క్రిప్ట్ ను బయటికి తీశాడు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ ను కలిసాడు. విజయ్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఇప్పుడు మరో హీరోని సెలెక్ట్ చేసుకున్నాడట.
‘కేజీఎఫ్’ చిత్రంతో ఇండియా వైడ్ పాపులర్ అయిన కన్నడ స్టార్ హీరో యష్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నాడట. అప్పుడే బెంగళూరులో యష్ ను కలిసి కథ కూడా వినిపించేశాడట పూరి. అయితే యష్ కొన్ని మార్పులు చెప్పాడట. ఆ మార్పులు చేసి స్క్రిప్ట్ ను మళ్ళీ వినిపించమని కోరాడట యష్. దీనికి పూరి కూడా ఓకే చెప్పాడట. ఫైనల్ సిటింగ్లో గనుక యష్ కథను ఒకే చెప్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం ఖాయం అంటున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు. ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయితే పూరి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టే అనడంలో సందేహం లేదు.