ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప 2: ది రూల్ (Pushpa 2) పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్దమవుతోంది. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప 1 (Pushpa) అంచనాలను మించి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించడంతో, సీక్వెల్ పుష్ప 2 పై ప్రేక్షకుల ఆసక్తి తారాస్థాయికి చేరుకుంది. ఇక డిసెంబర్ 5న గ్రాండ్ విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రం తొలి రోజే రికార్డు స్థాయి వసూళ్లను అందుకునేలా కనిపిస్తోంది.
ఇప్పటికే పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా థియేటర్లలో విడుదల కాగానే లాభాలను సొంతం చేసుకుంటుందని ట్రేడ్ వర్గాలు ధీమాగా ఉన్నాయి. బాక్సాఫీస్ అనలిస్టుల అంచనా ప్రకారం, ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 270 కోట్ల వసూళ్లు సాధించవచ్చని భావిస్తున్నారు. భారత్‌లోనే రూ. 200 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పుష్ప 2కి ప్రత్యేకమైన క్రేజ్ ఉండటంతో, తొలి రోజే రూ. 85 కోట్ల వరకు రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. కర్ణాటకలోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ ఉన్నందున, అక్కడి నుంచి సుమారు రూ. 20 కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. అలాగే తమిళనాడు నుంచి రూ. 12 కోట్లు, కేరళ నుంచి రూ. 8 కోట్లు రాబట్టవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఉండటంతో, అక్కడి నుంచి సుమారు రూ. 75 కోట్లు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి.
అంతేకాక, అంతర్జాతీయ మార్కెట్లలో కూడా పుష్ప 2కి భారీ ఆదరణ లభించే అవకాశం ఉండటంతో, ఓవర్సీస్లో తొలి రోజే రూ. 70 కోట్ల వసూళ్లు రాబట్టవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాల ప్రకారం చూస్తే, పుష్ప 2 మొదటి రోజే మొత్తం రూ. 270 కోట్ల వసూళ్లను దాటే అవకాశం ఉంది. ఇండస్ట్రీలో భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ చిత్రం, పాత రికార్డులను బ్రేక్ చేస్తుందని అభిమానులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.