Appudo Ippudo Eppudo Review in Telugu: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • నిఖిల్‌ (Hero)
  • రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్ (Heroine)
  • హర్ష చెముడు, అజయ్, జాన్ విజయ్ (Cast)
  • సుధీర్‌వర్మ (Director)
  • బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ (Producer)
  • కార్తీక్‌ (Music)
  • రిచర్డ్‌ ప్రసాద్‌ (Cinematography)
  • Release Date : నవంబర్ 08, 2024

నిఖిల్-సుధీర్ వర్మ కాంబినేషన్ లో “స్వామి రారా, కేశవ” లాంటి సినిమాల తర్వాత తెరకెక్కిన మూడో చిత్రం “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” (Appudo Ippudo Eppudo). టైటిల్ కి తగ్గట్లే ఈ సినిమా ఎప్పడు షూట్ చేశారో కూడా తెలియదు. ఉన్నపళంగా రిలీజ్ అని ప్రకటించారు. “కార్తికేయ 2” లాంటి బ్లాక్ బస్టర్ అనంతరం నిఖిల్ క్రేజ్ భారీగా పెరిగింది. కానీ.. “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” (Appudo Ippudo Eppudo) మీద మాత్రం కనీస స్థాయి అంచనాలు లేవు. ప్రమోషన్స్ కూడా పెద్దగా ఏమీ చేయకుండానే రిలీజ్ చేసేశారు. మరి ఈ సినిమా సంగతేంటో చూద్దాం..!!

Appudo Ippudo Eppudo

కథ: హైదరాబాద్ లో సరదాగా తిరిగే కుర్రాడు రిషి (నిఖిల్) (Nikhil). లవ్ ఫెయిల్ అవ్వడంతో కెరీర్ కోసం లండన్ వచ్చేస్తాడు. అక్కడ రేస్ డ్రైవర్ గా ట్రైనింగ్ తీసుకుంటూ.. పాకెట్ మనీ కోసం చిన్నపాటి పనులు చేస్తుంటాడు. లండన్ లో పరిచయమైన తులసి (దివ్యాంశ కౌశిక్)ను ప్రేమించి ఆమెను పెళ్లాడాలనుకుంటాడు.

కట్ చేస్తే.. తులసి మిస్ అవ్వడం, హైదరాబాద్ లో తాను ప్రేమించిన తార (రుక్మిణి వసంత్) లండన్ లో ప్రత్యక్షం అవ్వడంతో జీవితం మీద మళ్లీ ఆశలు చిగురిస్తాయి రిషికి.

అయితే.. రిషి అనుకోకుండా లోకల్ డాన్ బద్రినారాయణ (జాన్ విజయ్) చేతిలో ఇరుక్కుంటాడు.

అసలు బద్రి నారాయణ ఎవరు? రిషితో అతడికి ఏం పని? అతడి నుండి రిషి ఎలా తప్పించుకున్నాడు? ఈ కథలో తార, తులసిల పాత్ర ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” (Appudo Ippudo Eppudo) కథాంశం.

నటీనటుల పనితీరు: నిఖిల్ (Nikhil) తన లుక్స్ & టైమింగ్ తో ఎప్పట్లానే అలరించాడు. అతడి క్యారెక్టరైజేషన్ ను డెవలప్ చేసిన విధానంలో క్లారిటీ లేకపోవడంతో ఆడియన్స్ రిషి పాత్రకు కనెక్ట్ అవ్వలేకపోయారు.

రుక్మిణి వసంత్ ఈ సినిమాలో మేకప్ ఎందుకో సరిగా సెట్ అవ్వలేదు. ఆమె సహజమైన సౌందర్యానికి ఈ మేకప్ అడ్డుగోడలా నిలిచింది. హావభావాల ప్రకటన విషయంలో మాత్రం తనను తాను ప్రూవ్ చేసుకుంది.

దివ్యాంశ కౌశిక్ కి మంచి పాత్ర దొరికింది. నెగిటివ్ షెడ్ ఉన్న క్యారెక్టర్ కావడం, ఆమె లుక్స్ & గ్లామర్ కూడా బాగుండడంతో తులసి పాత్ర బాగా ఎంటర్టైన్ చేసింది.

హర్ష చెముడు కామెడీ టైమింగ్ నవ్విస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో కొన్ని సీన్స్ హిలేరియస్ గా వర్కవుట్ అయ్యాయి.

జాన్ విజయ్ & అజయ్ పాత్రలు పర్వాలేదు అనిపించుకోగా.. సత్యదేవ్ & సుదర్శన్ పాత్రలు కథకు కావాల్సిన వేగాన్ని అందించాయి.

సాంకేతికవర్గం పనితీరు: సుధీర్ వర్మ మార్క్ అనేది ప్రతి టెక్నికాలిటీలోనూ కనబడుతుంది. కెమెరా వర్మ్ మొదలుకొని లైటింగ్, మ్యూజిక్ వరకు “ఇది సుధీర్ వర్మ చిత్రం” అనేది ఎలివేట్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా కథను మూడో వ్యక్తి కోణంలో చూపించడం సినిమాని కాస్త వేగవంతం చేసింది. అయితే.. కథలోని కీలకమైన మలుపును రివీల్ చేసిన విధానం బెడిసికొట్టింది. ఫస్టాఫ్ మరీ పేలవంగా సాగింది. సెకండాఫ్ కాస్త బెటర్ గా ఉన్నప్పటికీ.. కీలకమైన సన్నివేశాల రూపకల్పన ఆకట్టుకునేలా లేకపోవడంతో అది కూడా పూర్తి స్థాయిలో అలరించలేకపోయింది.

రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ వర్క్ & కార్తీక్ పాటలు సోసోగా ఉన్నాయి. సన్నీ ఎం.ఆర్ నేపథ్య సంగీతం సినిమాకి కావాల్సిన ఎలివేషన్స్ ఇవ్వలేకపోయింది.

ప్రొడక్షన్ & ఆర్ట్ డిపార్టుమెంట్స్ వర్క్ పెద్దగా చెప్పుకొనే స్థాయిలో లేదు.

విశ్లేషణ: “ఆరెంజ్” లాంటి సినిమాలు రిలీజ్ అవ్వాల్సిన టైమ్ కంటే ముందు రావడం వల్ల ఫెయిల్ అయ్యాయి అంటూ ఉంటారు. ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే రిసెప్షన్ వేరేలా ఉండేది. కానీ.. కొన్ని సినిమాలు ట్రెండ్ తో సంబంధం లేకుండా చాలా లేటుగా విడుదలవుతుంటాయి. “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” సరిగ్గా అలాంటి సినిమానే. నిఖిల్ ఈ సినిమా ఎప్పుడో చేసాడని లుక్స్ పరంగానే తెలిసిపోతుంది. కంటెంట్ సోసోగా ఉండడం, కమర్షియాలిటీ పాళ్లు తక్కువవ్వడం, మరీ ముఖ్యంగా యాక్షన్ బ్లాక్ డిజైన్ చేసిన తీరు బాగోకపోవడంతో.. సినిమా వర్కవుట్ అవ్వలేదనే చెప్పాలి.

ఫోకస్ పాయింట్: అప్పుడెప్పుడో తీసిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సింది కాదు!

రేటింగ్: 2/5

సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus