Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

ప్రముఖ సీనియర్ నటి రాధ తన సోదరి, నటి అంబికపై సంచలన ఆరోపణలు చేశారు. తన గదిలో సంతకం చేసి ఉంచిన ఖాళీ చెక్కులను దొంగిలించింది అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.50 కోట్లను కాజేసేందుకు తన సోదరి అంబిక, సోదరుడు మల్లికార్జున్ (అర్జున్) ప్రయత్నించారని చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో రాధ ఫిర్యాదు చేశారు. దీంతో ఏం జరుగుతోంది అంటూ సీనియర్‌ నటి గురించి చర్చలు మొదలయ్యాయి.

Radha

చెన్నైలోని వలసరవాక్కంలో ఉన్న ఇంట్లో రాధ ఉంటున్నారు. వ్యాపార, వ్యక్తిగత పనుల నిమిత్తం ఆమె తరచూ ఇతర నగరాలకు వెళ్తుంటారు. దీంతో వ్యాపార అవసరాలు, సిబ్బంది జీతాల కోసం సంతకం చేసిన కొన్ని ఖాళీ చెక్కులను తన గదిలో ఉంచారు. అదే ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండే అంబికకు ఆ గదిలోకి వెళ్లే అవకాశం ఉంది. ఆ చనువుతో తన అనుమతి లేకుండా గదిలోకి వెళ్లి ఆ చెక్కులను తీసుకుంది అని రాధ ఆ కంప్లైంట్‌లో పేర్కొన్నారు.

ఈ చెక్కుల విషయం బయటకు ఎలా వచ్చిందంటే..  రాధకు చెందిన పోరూరులోని ఏఆర్‌ఎస్ గార్డెన్ స్టూడియో పేరును ఈ ఏడాది జనవరిలో ఆర్‌ఆర్‌ గార్డెన్‌గా మార్చారు. దీంతో ఆ పాత చెక్కులు చెల్లవని, కొత్త చెక్ బుక్ వాడుతున్నట్లు రాధ ఆ బ్యాంకుకు సమాచారం ఇచ్చారు. అయితే, సెప్టెంబర్ 17న అంబిక పేరు మీద ఐదు చెక్కులు (రూ.11 లక్షలు, రూ.13.17 కోట్లు, రూ.27.73 కోట్లు, రూ.7 కోట్లు, రూ.1.79 కోట్లు.. మొత్తంగా రూ.50.8 కోట్లు) డ్రా చేసేందుకు వచ్చాయని రాధకు బ్యాంకు నుంచి ఈ-మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఆమె ఆ లావాదేవీలను నిలిపివేశారు.

ఆ చెక్కులపై పేర్లు, వివరాలన్నీ తన సోదరుడు అర్జున్ నింపాడని రాధ అనుమానం వ్యక్తం చేశారు. వేరే వ్యవహారంలో ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో అర్జున్ భారీ జరిమానాను చెల్లించాల్సి ఉందని.. ఆ డబ్బు కోసమే అర్జున్‌, అంబిక కలసి ఇలా చేశారని రాధ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారితో తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని చెప్పారు. అలాగే, తన గదిలోని బంగారం, వజ్రాభరణాలు, ఆస్తి పత్రాలు చూడకుండా వారు అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus