బాహుబలి చిత్రాలతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగింది. స్టార్ డైరక్టర్లు, బాలీవుడ్ ఫిలిం మేకర్స్ అతని డేట్స్ కోసం క్యూలో ఉన్నారు. అయినా ప్రభాస్ మాత్రం యువ దర్శకులతోనే ముందుకు వెళ్తున్నారు. కేవలం ఒకే ఒక సినిమా అనుభవం ఉన్న సుజీత్ దర్శకత్వంలో భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టడీగా సాగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో షెడ్యూల్ నడుస్తోంది. దీని తర్వాత కూడా ప్రభాస్ యువ దర్శకుడితో పనిచేయడానికి ఓకే చెప్పారు. అతనే రాధాకృష్ణ. పలు సినిమాలకు రైటర్ గా పనిచేసిన ఇతను జిల్ సినిమాతో డైరక్టర్ గా మారారు. ఆ తర్వాత ప్రభాస్ ని డైరక్ట్ చేసే అవకాశం అందుకున్నారు.
రెండేళ్ల క్రితం ప్రభాస్ ఈ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పటి నుంచి ఎప్పుడు సినిమా మొదలవుతుందా? అని ఏ ప్రాజెక్ట్ ని ఒప్పుకోకుండా ఎదురుచూసారు. నిన్న(గురువారం) ఈ సినిమా హైదరాబాద్ లోని కృష్ణంరాజు ఆఫీసులో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. 1970 కాలం నాటి రొమాంటిక్ ప్రేమకథతో తెరకెక్కనున్న ఈ మూవీ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూశాను. ప్రభాస్ హీరోగా నటించే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక గోపీకృష్ణా మూవీస్ కృష్ణంరాజు గారి ఆఫీస్‌లో ఈరోజు ప్రారంభించాము. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవల్లో నిర్మించనున్నారు. డార్లింగ్ ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే పాల్గొనే సన్నివేశాలతో రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నాము’’ అని అన్నారు.