రైల్

  • September 22, 2016 / 12:58 PM IST

ఎందుకో తెలియదుకానీ.. తమిళ సినిమాలంటే మన తెలుగువారికి కాస్త ప్రియం. అందుకే ఒక్కోసారి అక్కడ ఫ్లాపాయిన సినిమాలు కూడా తెలుగులో సూపర్ హిట్ అయిపోతుంటాయి. అందుకే తమిళ హీరోలందరూ తెలుగుపై ప్రత్యేకమైన దృష్టి సారిస్తుంటారు. గతేడాది “రఘువరణ్ బీటెక్”తో తెలుగులో ఘన విజయం సొంతం చేసుకొన్న ధనుష్ నటించిన “తోడారి” అనే చిత్రాన్ని తెలుగులో “రైల్” అనే పేరుతో అనువదించారు. కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి తమిళనాట ప్రేమ కథల ఎక్స్ పర్ట్ ప్రభు సోలమన్ దర్శకత్వం వహించాడు. ఈ “రైల్” ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం..!!

కథ : బల్లి శివాజీ (ధనుష్) డిల్లీ నుంచి చెన్నై వెళ్తోన్న ఓ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో పాంట్రీ లో పనిచేసే ఓ యువకుడు. మొదటిచూపులోనే స్టార్ హీరోయిన్ శిరీషా టచప్ ఉమెన్ అయిన సరోజా (కీర్తి సురేష్)ను ప్రేమిస్తాడు. అదే ట్రైన్ లో పశుసంవర్ధక శాఖామంత్రి కూడా ప్రయాణిస్తుంటాడు.

అనుకోని సంఘటన కారణంగా ట్రైన్ డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో.. ఏ స్టేషన్ లోనూ ఆగకుండా దూసుకుపోతుంటుంది. దాదాపుగా 750 మంది ప్రయాణికులు ఉన్న ఆ ట్రైన్ స్టేషన్ లో ఆగిందా, శివాజీ-సరోజా ప్రేమ ప్రయాణం విజయపు తీరానికి చేరిందా వంటి ప్రశ్నలకు సమాధానంగా తెరకెక్కిన చిత్రమే “రైల్”.

నటీనటుల పనితీరు : ఒక నటుడిగా ధనుష్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంలోనూ బల్లి శివాజీ పాత్రలో కామెడీతోపాటు సెంటిమెంట్ ను సమపాళ్లలో పండించి అదరహో అనిపించుకొన్నాడు. పాత్రకు తగ్గట్లుగా తింగరి పిల్లగా కీర్తి సురేష్ ప్రేక్షకుల్ని కాసేపు నవ్వించింది. పాంట్రీ మేనేజర్ పాత్రలో తంబి రామయ్య, కమాండో పాత్రలో హరీష్ ఉత్తమన్, పోలీస్ ఆఫీసర్ గా గణేష్ వెంకట్రామన్ లు తమ తమ పాత్రల పరిధి మేరకు ప్రేక్షకుల్ని అలరించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు : సంగీత దర్శకుడు డి.ఇమామ్ సమకూర్చిన బాణీలు వినసోంపుగా ఉన్నాయి కానీ.. ఆ పాటల ప్లేస్ మెంట్ బాలేదు. నేపధ్య సంగీతం కూడా ఆడియన్స్ ను సన్నివేశంలో ఇన్వాల్వ్ చేసే స్థాయిలో లేదు. సినిమా మొత్తం దాదాపుగా ట్రైన్ లోనే సాగడంతో ఛాయాగ్రాహకుడు వెట్రివెల్ మహేంద్రన్ పనితనం పస లేని గ్రాఫిక్స్ కారణంగా నీరుగారిపోయింది.

ఫస్ట్ సాంగ్ మొదలుకొని క్లైమాక్స్ లో వచ్చే ట్రైన్ క్రాషింగ్ ఎపిసోడ్స్ వరకూ ప్రతి సన్నివేశంలోనూ గ్రాఫిక్ వర్క్స్ నీచంగా ఉన్నాయి. అందువల్ల మంచి ఫీల్ ఉన్న సీన్స్ లో కూడా ఆడియన్స్ ఇన్వాల్వ్ అవ్వలేరు. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేది. అసలే సోసోగా ఉన్న సినిమా 2.48 నిమిషాల నిడివి కారణంగా ఆడియన్స్ కు బాగా బోర్ కొట్టిస్తుంది.

“ప్రేమఖైదీ, గజరాజు” లాంటి విషాద ప్రేమకథలతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిన ప్రభు సాలోమన్ “రైల్” చిత్రంతో కథకుడిగానే కాక దర్శకుడిగానూ విఫలమయ్యాడు. హాలీవుడ్ చిత్రం “అన్ స్టాపబుల్”ను ఫ్రీమేక్ చేసేద్దామని చేసిన ప్రయత్నం మాత్రం దారుణంగా బెడిసికొట్టింది. ముఖ్యంగా.. సీరియస్ సీన్స్ లోనూ కామెడీ పండించాలని చేసిన ప్రయత్నం కొన్ని సన్నివేశాలవరకూ ఫర్వాలేదనిపించినా.. క్లైమాక్స్ లో మాత్రం ఇరిటేషన్ తెప్పించింది.

విశ్లేషణ : హాలీవుడ్ సినిమాల నుంచి స్పూర్తి పొందడం, ఆ కథలను మన సౌత్ నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసి మన తెలుగు/తమిళ ప్రేక్షకులకు వార్చి వడ్డిస్తూనే ఉన్నారు మన దర్శకులు. ఇంతకుముందంటే.. మనోళ్ళకి హాలీవుడ్ సినిమాలపై సరైన అవగాహన లేకపోవడంతో సదరు సినిమాలు ఎలా ఉన్నా ఆదరించేవారు. కానీ.. ఈమధ్య స్టార్ మూవీస్, హెచ్.బి.ఓ లాంటి చానల్స్ కారణంగా అందరికీ హాలీవుడ్ సినిమాలు అందుబాటులోకి వచ్చేశాయి. అందువల్ల మన దర్శకులు ఈ మధ్య కొరియన్ సినిమాల మీద పడ్డారు.
అందువల్ల ఆంగ్ల చిత్రాలు చూసే అర్బన్ ఆడియన్స్ కు ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. అయితే.. మధ్య మధ్యలో వచ్చే కామెడీ ట్రాక్స్ వల్ల మాస్ ఆడియన్స్ ను మాత్రం ఓ మోస్తరుగా ఆకట్టుకోగల చిత్రం “రైల్”.

రేటింగ్ : 1.5/5

Click Here For English Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus