Tollywood: టాలీవుడ్‌కు మళ్ళీ మార్చి గండం.. సమ్మర్ ప్లానింగ్‌లో మేకర్స్ ఫెయిల్ అవుతున్నారా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి తర్వాత అంతటి క్రేజ్ ఉన్న సీజన్ సమ్మర్. స్టూడెంట్స్‌కు హాలిడేస్ ఉండటంతో ఈ సమయంలో థియేటర్లకు ఆడియన్స్ క్యూ కడతారు. అయితే గతేడాది లాగే ఈసారి కూడా మార్చి నెలను టాలీవుడ్ వేస్ట్ చేసుకునేలా కనిపిస్తోందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల వేసవి ప్రారంభంలో ఉండాల్సిన సందడి కనిపించడం లేదనేది సగటు సినీ ప్రేమికుడి ఆవేదన.

Tollywood

నిజానికి మార్చి నెలకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క భారీ సినిమా మీద కూడా క్లారిటీ లేదు. చాలామంది హీరోలు తమ సినిమాలను సమ్మర్ కానుకగా అనౌన్స్ చేసినప్పటికీ, అవన్నీ అనుకున్న సమయానికి వస్తాయా లేదా అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్‌గా మారింది. షూటింగ్స్ ఆలస్యం అవ్వడం లేదా గ్రాఫిక్స్ పనుల వల్ల విడుదల తేదీలు మారుతుండటంతో మార్చి బాక్సాఫీస్ ఖాళీగా మిగిలిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

షెడ్యూల్ ప్రకారం చూస్తే రామ్ చరణ్ ‘పెద్ది’, నాని ‘ది ప్యారడైజ్’ చిత్రాలు మార్చి చివరలో ఒకరోజు గ్యాప్‌లో రిలీజ్ కావాలి. కానీ ఈ రెండు సినిమాలు పోస్ట్‌పోన్ అవుతాయనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఒకవేళ ఇవి తప్పుకుంటే పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆ గ్యాప్‌ను భర్తీ చేస్తుందని కొందరు భావిస్తున్నా, మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక యంగ్ హీరోల విషయానికొస్తే అడవి శేష్ ‘డెకాయిట్’, నిఖిల్ ‘స్వయంభూ’ వంటి చిత్రాలు మార్చి మధ్యలో రావాల్సి ఉంది. అయితే వీటి మేకింగ్ ఇంకా పూర్తికాకపోవడంతో ఈ సినిమాలు కూడా డౌటేనని టాక్.

ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వాయిదా పడితే, కీలకమైన మార్చి నెలలో ఆడియన్స్‌కు వినోదం కరువవుతుంది. ఇది ఇండస్ట్రీకి కూడా ఆర్థికంగా పెద్ద నష్టమే కలిగిస్తుందని ట్రేడ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్ద హీరోలు, నిర్మాతలు కేవలం విడుదల తేదీలను ప్రకటించడమే కాకుండా, వాటిని ఫాలో అవ్వడం కూడా ముఖ్యమని నెటిజన్లు సూచిస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా సినిమాలు రాకపోతే సమ్మర్ బజ్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. మరి ఈ గందరగోళం మధ్య ఏ హీరో ధైర్యంగా బాక్సాఫీస్ బరిలో దిగుతారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus