బాహుబలి కంక్లూజన్ ని చూసిన ప్రతి ఒక్కరూ థియేటర్ నుంచి బయటికి రాగానే సినిమా అద్భుతంగా ఉంది అంటూనే మహిష్మతి రాజ్యానికి ఇంతటితో ముగింపు పలకడం బాగాలేదని చెబుతున్నారు. సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ స్టార్లు సైతం బాహుబలి సినిమాకి పార్ట్ 3 రావాలని కోరుకుంటున్నారు. అంతేకాదు కంక్లూజన్ చివరిలో ఎండ్ టైటిల్స్ పడిన తర్వాత తణికెళ్ల భరణికి, చిన్న కుర్రాడికి మధ్య చిన్నపాటి సంభాషణ జరుగుతుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ మూడవ పార్ట్ కు లీడ్ ఇచ్చారని భావిస్తున్నారు. దీంతో అందరిలోనూ మూడవ పార్ట్ పై ఆసక్తి ఎక్కువైంది.
ఈ విషయం పై ప్రస్తుతం లండన్ టూర్లో ఉన్న రాజమౌళి స్పందించారు. ‘సినిమాకు మార్కెట్ ఉంది కాబట్టి ఏదో ఒక స్టోరీతో సినిమా చేస్తే బాగుండదు. అలా చేయడం నా వల్ల కాదు. కానీ ఒకవేళ మా నాన్నగారు అనువైన కథను సిద్ధం చేస్తే మూడవ భాగం చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని రాజమౌళి అన్నారు. సో దీన్నిబట్టి బాహుబలి పార్ట్ 3 వచ్చే అవకాశాలు సజీవంగానే ఉన్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.