సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ అంటే చాలామంది భయం. ఎందుకంటే అతని సినిమాల్లో ఆగ్రహం, ఆవేశంతో నటించి అందరికీ అతనంటే సీరియస్ భావన కల్పించారు. బయట ఫంక్షన్లో కూడా రాజశేఖర్ సీరియస్ గా ఉంటారు. అందుకే రాజశేఖర్ అంటే కొందరిలో భయం ఏర్పడింది. అయితే రాజశేఖర్ కి అలనాటి హీరోయిన్ రాధిక అంటే భయమంట. నిజమే.. ఇది మేము చెప్పడం లేదు. స్వయంగా అతనే చెప్పారు. రాధిక శరత్‌కుమార్, విజయ్ ఆంటోని సంయుక్తంగా నిర్మించిన ఇంద్రసేన మూవీ ఆడియో లాంచ్ నిన్న హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజశేఖర్, జీవిత ముఖ్య అతిథులుగా హాజరై.. పాటలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ వేదికపై మాట్లాడుతూ “రాధిక అంటే నాకు కొంచెం భయం” అన్నారు. ఎందుకు భయమో కూడా చెప్పారు. “నేను రాధికతో కలిసి చల్లని రామయ్య.. చక్కని సీతమ్మ అనే సినిమాలో నటించాను. ఆ సినిమా షూటింగ్ లో అద్దం తీసుకొచ్చి.. తల దువ్వుకుంటుంటే… వెంటనే రాధిక వచ్చి అద్దాన్ని తీసేసుకొని, “నువ్వు బాగున్నావు.. ఓకే యాక్ట్ చెయ్యి.. అనేది” అంటూ ఆనాటి రాధిక చేష్టలను రాజశేఖర్ చెప్పారు. దీంతో వేదిక మీద ఉన్నవారితో పాటు, వేడుకకు వచ్చినవారంతా నవ్వుకున్నారు.