2019 ఎన్నికల్లో వై.ఎస్. జగన్ ఘానా విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. అయితే ఇదే క్రమంలో ‘జగన్ సీఎం అవ్వడం సినీ పరిశ్రమకి ఇష్టం లేదని.. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా ఎవ్వరూ కలిసి అభినందించలేదని’ ఎస్వీబీసీ చైర్మన్ , సినీ నటుడు పృథ్వీ గతంలో కొన్ని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. పృథ్వీ చేసిన ఆరోపణలను ఇప్పటికే అదే వైసీపీలో ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి తప్పుబట్టాడు కూడా..! అప్పట్లో ఇది పెద్ద దుమారమే లేపింది.
తాజాగా నటుడు రాజేంద్రప్రసాద్ కూడా పృథ్వీకి కౌంటర్ ఇచ్చాడు. శుక్రవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు రాజేంద్రప్రసాద్. ఈ సమావేశంలో భాగంగా… ” సీఎం ని వెంటనే కలవడానికి సినీ నటులేం వ్యాపారవేత్తలు కాదు.. కళాకారులు సీఎంని కలవాలన్న నిబంధన ఏమీ లేదు. జగన్ సీఎంగా సెటిల్ అయిన తరువాత కలుస్తాము. జగన్ తో మాకు సన్నిహిత సంబంధాలున్నాయి.. రెండు రాష్ట్రాల సీఎంలు కూడా సినీ పరిశ్రమ పట్ల సానుకూలంగా ఉంటున్నారు. ప్రజలకు త్రాగు నీరందించే ముఖ్యమంత్రి మాకు దేవుడు. జగన్ ని రేపు కలవాల్సివుంది… కానీ ఇతర కారణాల వల్ల కుదరకపోవడంతో… మరో రెండు మూడు రోజుల్లో కలవడానికి అవకాశమిచ్చారు” అంటూ రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.