రాక్షసుడు

గత ఏడాది తమిళంలో విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న అతి తక్కువ సినిమాల్లో సైకలాజికల్ థ్రిల్లర్ “రాట్ససన్” ఒకటి. ఆ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో “రాక్షసుడు” పేరుతో రీమేక్ చేశారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి అంచనాల నడుమ నేడు (ఆగస్ట్ 2) విడుదలైంది. బెల్లంకొండ ప్రీరిలీజ్ ఈవెంట్ లో సినిమా గురించి మాట్లాడుతూ “ఇదే నా మొదటి సినిమా” అనడం చర్చనీయాంశంగా మారింది. మరి బెల్లంకొండ శ్రీనివాస్ అంతగా ఆశలు పెట్టుకొన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకొన్నారు అనేది చూద్దాం..!!

కథ: అర్జున్ కుమార్ (బెల్లంకొండ శ్రీనివాస్) దర్శకుడు అవ్వాలనే ధ్యేయంతో.. నగరంలో జరుగుతున్న వరుస హత్యలన్నీ స్టడీ చేసి.. ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చేస్తాడు. ఆ కథను పట్టుకొని చాన్నాళ్లపాటు తిరిగినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఈలోపు తన మామయ్య ఫోర్స్ చేయడంతో.. ఎస్.ఐ పరీక్షలు రాసి డిపార్ట్ మెంట్ లో జాయిన్ అవుతాడు. అప్పటికే.. పోలీసులకు పెద్ద సమస్యగా మారిన వరుస యువతుల హత్య కేస్ లో అనుకోకుండా అర్జున్ ఇన్వాల్వ్ అవుతాడు. తాను ఎన్నాళ్ల నుండో స్క్రిప్ట్ కోసం కలెక్ట్ చేసిన డీటెయిల్స్ బట్టి ఈ హత్యలు చేస్తున్నది ఓ సీరియల్ కిల్లర్ అని గ్రహించి.. అతడ్ని పట్టుకోవడం కోసం ఒక కొత్త దారిని కనుక్కోంటాడు.

ఈ క్రమంలో తన పై అధికారిణి లక్ష్మీ (సుజనా జార్జ్) కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈ క్రమంలో స్కూల్ టీచర్ కృష్ణవేణి (అనుపమ పరమేశ్వరన్) అందించిన ఇన్ఫర్మేషన్ తో సైకో కిల్లర్ ను పట్టుకొనే క్లూస్ దొరుకుతాయి. రెండుమూడు సార్లు అతడ్ని పట్టుకోవడంలో ఆఖరి నిమిషంలో ఫెయిల్ అవుతాడు. కానీ.. ఒక అమ్మాయిని మాత్రం చావు బారి నుండి రక్షించగలుగుతాడు.

చివరికి అర్జున్ ఆ సైకో కిల్లర్ ను పట్టుకోగలిగాడా? అసలు ఆ సైకో కిల్లర్ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? స్కూల్ లో చదువుకొనే అమ్మాయిలను టార్గెట్ గా ఎందుకు ఎంచుకొన్నాడు? వంటి ప్రశ్నలకు ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో చెప్పిన సమాధానాల సమాహారమే “రాక్షసుడు” చిత్రం.

నటీనటుల పనితీరు: “అల్లుడు శీను” మొదలుకొని “సీత” వరకూ ప్రతి సినిమాలో డ్యాన్సులు, ఫైట్ల విషయంలో పర్వాలేదనిపించుకొన్న బెల్లంకొండ శ్రీనివాస్.. మొదటి నుండి ఫెయిల్ అవుతున్న విషయం హావభావాల ప్రకటన. “రాక్షసుడు” సినిమాకి వచ్చేసరికి అందులో కాస్త ఇంప్రూవ్ మెంట్ కనిపించింది. కథకు అవసరమైన వేరియేషన్స్ చూపలేకపోయాడు కానీ.. ఎమోషనల్ సీన్స్ లో అలరించాడు. నటుడిగా చాలా సన్నివేశాల్లో ఇంప్రూవ్ మెంట్ కనిపించింది.

అనుపమ క్యూట్ లెక్చరర్ గా ఆకట్టుకొంది. ఆమె వయసుకు మించిన పాత్ర అనిపించినప్పటికీ.. నట ప్రతిభతో ఆ మైనస్ ను కవర్ చేసింది.

రాజేవ్ కనకాల ఎమోషనల్ రోల్లో ఎప్పట్లానే ఆకట్టుకొన్నాడు. చాలా రోజుల తర్వాత కాస్త పెద్ద పాత్రలో కనిపించాడు.

కొన్ని కీలకపాత్రలు మినహా.. సినిమాలో నెగిటివ్ రోల్స్ ప్లే చేసిన నటులందరూ తమిళులే అవ్వడం గమనార్హం. వాళ్ళు కూడా తెలుగు ఆర్టిస్టులు అయ్యుంటే ఇంకాస్త బాగుండేది.

సాంకేతికవర్గం పనితీరు: జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ & వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్స్. జిబ్రాన్ నేపధ్య సంగీతం ప్రేక్షకుల్ని ప్రతి సన్నివేశంలో లీనమయ్యేలా చేయడానికి దోహదపడింది. కొన్ని సన్నివేశాల్లో జిబ్రాన్ పనితనం వెన్నులో చలి పుట్టిస్తుంది కూడా.

వెంకట్ సి.దిలీప్ యాంగిల్స్ పరంగా రాట్ససన్ ను దింపేసినప్పటికీ.. కలర్ గ్రేడింగ్, లైటింగ్ & డి.ఐ విషయంలో మాత్రం తన మార్క్ ను వేయగలిగాడు.

ప్రొడక్షన్ వేల్యుస్ బాగున్నాయి. ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ తమిళ వెర్షన్ కంటే తెలుగులో బాగుంది.

దర్శకుడిగా రమేష్ వర్మ తన మార్క్ కోసం పెద్దగా తపించలేదు. తమిళ వెర్షన్ ను యాజిటీజ్ గా ఫాలో అయిపోయాడు. నటీనటుల నుంచి చక్కని నటన రాబట్టుకోవడంలో సఫలీకృతుడయ్యాడు. తమిళ వెర్షన్ చూడనివారిని “రాక్షసుడు” విశేషంగా ఆకట్టుకొంటాడు. చూసినవాళ్ళకి మాత్రం యావరేజ్ అనిపిస్తుంది. అందుకు కారణం సినిమాలో సహజత్వం లోపించడం. సినిమాలో సగానికిపైగా తమిళ ఆర్టిస్టులే ఉండడంతో.. కొన్నిసార్లు అనువాద చిత్రం చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆ మైనస్ ను పక్కన పెడితే.. “రాక్షసుడు” ఒక డీసెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ గా మలిచాడు రమేష్ వర్మ.

విశ్లేషణ: పైన పేర్కొన్నట్లుగా తమిళ వెర్షన్ ఆల్రెడీ ఒకటికి రెండుసార్లు చూసినవాళ్ళకి “రాక్షసుడు” ఒక యావరేజ్ సినిమా అనిపిస్తుంది. కానీ.. కొత్త ప్రేక్షకులకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ను ఇచ్చే సినిమా ఇది. బెల్లంకొండ వాయిస్ మరియు లెక్కకుమిక్కిలి తమిళ ఆర్టిస్టులు తప్ప వేరే మైనస్ లేని సినిమా “రాక్షసుడు”. మొత్తానికి అయిదేళ్ల తర్వాత హిట్ కొట్టాలన్న బెల్లంకొండ శ్రీనివాస్ కల నెరవేరింది.

రేటింగ్: 3/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus