తెలుగువారికి హీరోయిన్ రంభ గురించి పరిచయం చేయనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవితో మూడు సినిమాల్లో స్టెప్పులు వేసిన ఈ భామ.. యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ తో నాచోరే నాచోరే అంటూ అదరగొట్టింది. అలాగే పెళ్లి అయిన తర్వాత డాన్స్ షోకి జడ్జిగా వ్యవహరించింది. ఇలా బుల్లితెర వీక్షకులకు కూడా దగ్గరయింది. ఈ అందాల సుందరి మూడోసారి తల్లి అయింది. రంభ 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్ర కుమార్ ని పెళ్లి చేసుకుంది. దుబాయ్ లోనే కాపురం పెట్టారు. ఇద్దరి పిల్లలకు తల్లి అయింది. అనంతరం భర్తతో గొడవరావడంతో ఇండియాకి తిరిగి వచ్చేసింది. 2016లో విడాకులు కావాలని చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. కేసును పరిశీలించిన కోర్టు ఇద్దరూ కలిసి ఓ అవగాహనకు రావాలంటూ సూచన చేసింది.
దీంతో భార్యాభర్తలిద్దరూ మళ్లీ కలిసి జీవించడం మొదలెట్టారు. ఇప్పుడు మరింత అన్యోన్యంగా ఉన్నారు. అందుకు గుర్తుగా రంభ మళ్లీ తల్లి అయింది. ఈసారి అబ్బాయి పుట్టాలని రంభ కోరుకుంది. ఆమె కోరిక నెరవేరాలని కుటంబ సభ్యులు, ఆత్మీయులు సీమంతం రోజు ఆశీర్వదించారు. అందరూ కోరుకున్నట్టే ఈసారి ఇంద్ర, రంభ దంపతులకు అబ్బాయి పుట్టాడు. ఈనెల 23 న తన భార్య (రంభ) బాబుకి జన్మనిచ్చిందని ఇంద్ర ఆనందంతో సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ శుభవార్త రంభ కుటుంబ సభ్యులతో పాటు, అభిమానుల్లోను ఆనందాన్ని నింపింది.