మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం “ఖైదీ నంబర్ 150” లో ఐటెం సాంగ్ కి మొదట సరైనోడు భామ క్యాథరీన్ ను డైరక్టర్ వి.వి.వినాయక్ సెలక్ట్ చేశారు. షూటింగ్ సమయానికి ఆమె స్థానంలో సర్దార్ గబ్బర్ సింగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన “తోబ తోబ” అంటూ దుమ్మురేపిన లక్ష్మీరాయ్ రీప్లేస్ అయింది. ఈ మార్పు వెనుక చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత హస్తం ఉందని సమాచారం.
ఎలాగంటే… ఖైదీ నంబర్ 150 చిత్రానికి కాస్టూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న సుస్మిత .. క్యాథరీన్ కోసం డ్రస్ డిజైన్ చేసిందని, దానిని ఆ హాట్ భామ వేసుకోక పోగా సుస్మితని అగౌరపరిచిందని చిత్ర బృందం వెల్లడించింది. ఈ విషయాన్నీ చిత్ర నిర్మాత, సోదరుడు రామ్ చరణ్ తేజ్ కి చెప్పడంతో, అతను క్యాథరిన్ ని తొలిగించి, లక్ష్మి రాయ్ ని తీసుకున్నట్లు తెలిపింది.
ఆ మార్పు సినిమాకు ప్లస్ అయిందని చిత్ర యూనిట్ సభ్యులు ఆనందపడుతున్నారు. చిరుతో పోటీ పడుతూ లక్ష్మి రాయ్ డ్యాన్స్ వేస్తోందని, వారిద్దరి కాంబినేషన్లో వచ్చే పాట మాస్ ప్రేక్షకులకు కిక్ ఇస్తుందని చెప్పారు. గత రెండు రోజులుగా మెగాస్టార్ చిరంజీవి, లక్ష్మి రాయ్ పై పాటని అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు.