విశాల్, తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం ‘యాక్షన్’. ఈ చిత్రం నవంబర్ 15న విడుదలై డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం కలెక్షన్ల విషయంలో మాత్రం జోరు చూపించలేకపోతుంది. విశాల్ సినిమాకి మంచి మార్కెట్ ఉంది. అయినప్పటికీ ఆ స్థాయిలో వసూళ్ళు రాకపోవడం గమనార్హం. ‘యాక్షన్’ కు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడానికి కారణం దర్శకుడు సుందర్.సి నే అంటున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు. కోలీవుడ్ మీడియా వర్గాలు కూడా ఆయన పేరే చెబుతున్నారు. ఈ చిత్రానికి హీరో ఇమేజ్ ను మించి ఖర్చుపెట్టించడంతో పాటు అవసరానికి మించి ‘యాక్షన్’ ఎపిసోడ్ లు పెట్టడం.. వాటితోనే టీజర్ ,ట్రైలర్ లు నింపేయడం ప్రధాన కారణం అంటున్నారు.
సుందర్.సి తెలుగులో ఇండస్ట్రీ హిట్ అయిన ఓ సినిమాని అక్కడ శింబు తో తెరకెక్కించి పెద్ద డిజాస్టర్ చేసాడు. ఆ విషయాన్ని కూడా ప్రేక్షకులు దృష్టిలో పెట్టుకుని ‘యాక్షన్’ సినిమాని పట్టించుకోలేదని తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ దర్శకుడు.. రజినీకాంత్ తో ‘అరుణాచలం’ వంటి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడన్న సంగతి కూడా పక్కన పెట్టేసారు. ఇక నవంబర్ సీజన్లో ఎలాగూ సౌత్ సినిమాలు పెద్దగా ఆడవు అనే సెంటిమెంట్ కూడా ఉంది. దానికి తోడు ప్రమోషన్లు కూడా పెద్దగా చేయలేదు. ఇదిలా ఉంటే… ‘యాక్షన్’ చిత్రానికి తెలుగు,తమిళ్ కలుపుకుని 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే… విడుదలైన 4 రోజులకి కేవలం 6కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. మొత్తానికి ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ నష్టాల్నే మిగిల్చేలా ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.